- నోటీస్ బోర్డుపై తరగతుల వారీగా ఫీజులు ప్రదర్శించడం తప్పనిసరి
- వెబ్‌సైట్‌తోపాటు విద్యాశాఖ పోర్టల్‌లోనూ పూర్తి వివరాలు నమోదు చేయాలి
- నిబంధనలు పాటించని పాఠశాలలకు షోకాజ్ నోటీసులు.. కఠిన చర్యలు
సామాన్యుడి అస్త్రం / హైదరాబాద్ : ప్రైవేట్ పాఠశాలల ఫీజుల విషయంలో ఇప్పటివరకు కొనసాగుతున్న గోప్యతకు తెరదించేందుకు తెలంగాణ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. 2026–27 విద్యా సంవత్సరానికి వసూలు చేసే ఫీజుల వివరాలను ప్రతి ప్రైవేట్ పాఠశాల బహిరంగంగా ప్రకటించాల్సిందేనని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఈ. నవీన్ నికోలస్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
ఫీజుల గుట్టు ఇక చెల్లదు
ప్రతి పాఠశాల తన నోటీస్ బోర్డుపై తరగతుల వారీగా నిర్ణయించిన ఫీజులను తల్లిదండ్రులకు స్పష్టంగా కనిపించేలా ప్రదర్శించాలి. పాఠశాల అధికారిక వెబ్‌సైట్‌లోనూ పూర్తి ఫీజుల పట్టికను అందుబాటులో ఉంచాలి. దీంతో అడ్మిషన్ సమయంలో ఒక రేటు చెప్పి, ఆ తర్వాత వివిధ పేర్లతో అదనపు మొత్తాలు వసూలు చేసే విధానానికి అడ్డుకట్ట పడే అవకాశం ఉంది.
పోర్టల్‌లో పూర్తి లెక్కలు
ఫీజుల వివరాలను schooledu.telangana.gov.in పోర్టల్‌లో నమోదు చేయడం తప్పనిసరి. ఫీజులను ఏ ప్రాతిపదికన నిర్ణయించారో తెలిపే పత్రాలను కూడా పోర్టల్‌లో అప్‌లోడ్ చేయాలి. గవర్నింగ్ బాడీ సభ్యుల సంతకాలతో కూడిన ఫీజు నిర్ణయ పత్రాలను సమర్పించాలని విద్యాశాఖ ఆదేశించింది. G.O.Ms.No.1లోని రూల్ 16, 18 ప్రకారం ఈ ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుంది.
దాచితే షోకాజ్.. ఉల్లంఘిస్తే చర్య
నోటీస్ బోర్డు, వెబ్‌సైట్, విద్యాశాఖ పోర్టల్—ఈ మూడు వేదికల్లో ఫీజుల వివరాలను ప్రకటించని పాఠశాలలకు షోకాజ్ నోటీసులు జారీ చేయనున్నారు. G.O.Ms.No.1లోని రూల్ 11 ప్రకారం నిబంధనలు ఉల్లంఘించిన యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకుంటామని డైరెక్టర్ హెచ్చరించారు.
అధికారుల పర్యవేక్షణకే అసలు పరీక్ష
ఆదేశాలు కాగితాలకే పరిమితం కాకుండా అమలయ్యేలా జిల్లా విద్యాశాఖ అధికారులు, ప్రాంతీయ సంయుక్త విద్యాశాఖ అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని నవీన్ నికోలస్ ఆదేశించారు. ఫీజుల పారదర్శకతతో తల్లిదండ్రులకు ఊరట లభించనుండగా, క్షేత్రస్థాయిలో విద్యాశాఖ ఎంత కఠినంగా వ్యవహరిస్తుందన్నదే ఇప్పుడు కీలకం.