Telangana

21 ఎకరాలకు హద్దులు ఫిక్స్.. కబ్జాదారులపై కేసులు ఎక్కడ?

21 ఎకరాలకు హద్దులు ఫిక్స్.. కబ్జాదారులపై కేసులు ఎక్కడ?
  • టీజీహెచ్‌బీ–రెవెన్యూ అధికారుల సంయుక్త సర్వే పూర్తి
  • సర్వే నంబర్ 472లోని 21 ఎకరాలకు బౌండరీ మార్కింగ్
  • హెచ్చరిక బోర్డులు, శాశ్వత ఫెన్సింగ్ ఏర్పాటులో జాప్యంపై ప్రశ్నలు

దుండిగల్ మండలం బౌరంపేట్ గ్రామ పరిధిలోని సర్వే నంబర్ 472లో తెలంగాణ హౌసింగ్ బోర్డుకు కేటాయించిన 21 ఎకరాల భూమి ఆక్రమణకు గురవుతోందన్న ఆరోపణలపై ఎట్టకేలకు అధికార యంత్రాంగం స్పందించింది. ‘పెన్ పవర్’ దినపత్రికలో ప్రచురితమైన వరుస కథనాలు, ఆకుల సతీష్ చేసిన ఫిర్యాదు నేపథ్యంలో తెలంగాణ హౌసింగ్ బోర్డు, రెవెన్యూ శాఖ అధికారులు సంయుక్త సర్వే నిర్వహించారు.

భూ రికార్డులు, అందుబాటులో ఉన్న మ్యాపుల ఆధారంగా 21 ఎకరాల విస్తీర్ణానికి హద్దులను గుర్తించి బౌండరీ మార్కింగ్ పూర్తిచేసినట్లు అధికారులు వెల్లడించారు. ప్రభుత్వ స్థలాన్ని రక్షించేందుకు త్వరలో హెచ్చరిక బోర్డులు, శాశ్వత ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తామని టీజీహెచ్‌బీ డీఈఈ వాణి తెలిపినట్లు సమాచారం.

హద్దులు గుర్తించారు.. బాధ్యులెవరో గుర్తించరా?

ప్రభుత్వ భూమిలో అనధికార లేఅవుట్లు వేసి, ప్లాట్లుగా విభజించి అమాయకులకు విక్రయిస్తున్నారన్న తీవ్రమైన ఆరోపణలు కొంతకాలంగా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో జాయింట్ సర్వేతో హద్దులు నిర్ధారించడం కీలక పరిణామమే అయినప్పటికీ, ఇప్పటివరకు బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు కాకపోవడం అనుమానాలకు తావిస్తోంది. 

2024లో అప్పటి అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి ఈ ప్రాంతాన్ని పరిశీలించినట్లు తెలుస్తోంది. అప్పటి నుంచే పరిస్థితి అధికారుల దృష్టిలో ఉన్నప్పటికీ చర్యల్లో జాప్యం ఎందుకు జరిగిందన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. క్షేత్రస్థాయి రెవెన్యూ సిబ్బంది ఉన్నప్పటికీ ఆక్రమణలు, ప్లాట్ల విక్రయాలు ఎలా కొనసాగాయన్న దానిపై సమగ్ర విచారణ జరపాలని స్థానికులు కోరుతున్నారు.

మరోవైపు, అసైనీల అభ్యర్థన మేరకు బోర్డులు, ఫెన్సింగ్ ఏర్పాటుకు ఒకరోజు గడువు ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. దీనిపై అధికారులు స్పష్టత ఇవ్వాల్సి ఉంది. ప్రభుత్వ భూమిలో ఎలాంటి ప్లాట్లు కొనుగోలు చేయవద్దని దుండిగల్ తహశీల్దార్ ప్రజలను హెచ్చరించారు. ఇప్పటికే ప్లాట్లు కొనుగోలు చేసిన వారి వివరాలు సేకరించడంతోపాటు విక్రయాలకు పాల్పడిన వారిపై కేసులు నమోదు చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. హద్దులు గుర్తించడంతోనే బాధ్యత పూర్తికాదని, ఫెన్సింగ్ ఏర్పాటు చేసి భూమిని పూర్తిస్థాయిలో స్వాధీనంలోకి తీసుకున్నప్పుడే ప్రభుత్వ చర్యకు అర్థం ఉంటుందని స్పష్టం చేస్తున్నారు.


Related News సంబంధిత వార్తలు

Advertisement 728 x 90 Banner Placehoder