Telangana

తెలంగాణ ఓటరు జాబితాపై షాక్‌.. 1.36 లక్షల దరఖాస్తులు తిరస్కరణ!

తెలంగాణ ఓటరు జాబితాపై షాక్‌.. 1.36 లక్షల దరఖాస్తులు తిరస్కరణ!
  • ఫారం–6 ద్వారా అందిన కొత్త ఓటరు దరఖాస్తులు 4,28,682
  • ఓటరు జాబితాలో నమోదైన దరఖాస్తులు 2,91,780
  • తిరస్కరణకు గురైన దరఖాస్తులు 1,36,902
సామాన్యుడి అస్త్రం  / పటాన్ చెరు : తెలంగాణలో ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియ పూర్తయిన నేపథ్యంలో కొత్త ఓటర్ల నమోదు గణాంకాలు చర్చనీయాంశంగా మారాయి. ఫారం–6 ద్వారా రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 4,28,682 దరఖాస్తులు అందగా, వాటిలో 2,91,780 దరఖాస్తులను ఆమోదించి ఓటరు జాబితాలో నమోదు చేసినట్లు అందుబాటులో ఉన్న సమాచారం వెల్లడిస్తోంది. మిగిలిన 1,36,902 దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయి.
ఈ లెక్కల ప్రకారం దరఖాస్తు చేసుకున్న వారిలో సుమారు 68 శాతం మంది పేర్లు ఓటరు జాబితాలో చేరగా, దాదాపు 32 శాతం దరఖాస్తులు తిరస్కరణకు గురైనట్లు స్పష్టమవుతోంది. లక్షకు పైగా దరఖాస్తులు తిరస్కరించబడటం వెనుక కారణాలేమిటనే ప్రశ్న ఇప్పుడు తెరపైకి వచ్చింది.

తిరస్కరణకు కారణాలేమిటి?
దరఖాస్తుల్లో అసంపూర్ణ సమాచారం, సరైన చిరునామా ఆధారాలు లేకపోవడం, ఇప్పటికే ఓటరుగా నమోదై ఉండటం, వయస్సు లేదా ఇతర అర్హతలకు సంబంధించిన సమస్యల కారణంగా కొన్ని దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యే అవకాశం ఉంటుంది. అయితే ప్రస్తుతం వెల్లడైన గణాంకాల్లో తిరస్కరణకు సంబంధించిన కారణాలవారీ వివరాలు పొందుపరచలేదు. ఓటు హక్కు ప్రజాస్వామ్యానికి పునాది కావడంతో ప్రతి తిరస్కరించిన దరఖాస్తుకు స్పష్టమైన కారణాన్ని సంబంధిత వ్యక్తికి తెలియజేయాల్సిన అవసరం ఉంది. అర్హులైనవారు సాంకేతిక లేదా పత్రాల సమస్యల కారణంగా ఓటు హక్కును కోల్పోకుండా ఎన్నికల అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. దరఖాస్తు తిరస్కరణకు గురైన వారు తమ పేరు ఓటరు జాబితాలో ఉందో లేదో వెంటనే పరిశీలించుకోవాలి. పేరు నమోదు కాకపోతే సంబంధిత బూత్‌ లెవల్‌ అధికారి లేదా ఎన్నికల నమోదు అధికారిని సంప్రదించి, అవసరమైన ఆధారాలతో మరోసారి దరఖాస్తు చేసుకోవాలి. తిరస్కరించిన 1,36,902 దరఖాస్తులపై జిల్లాలవారీగా పూర్తి వివరాలు వెల్లడిస్తేనే అసలు పరిస్థితిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

Related News సంబంధిత వార్తలు

Advertisement 728 x 90 Banner Placehoder