Telangana

తమ్మిడికుంటకు కొత్త జీవం.. కబ్జాల నుంచి సుందరవనం దిశగా!

తమ్మిడికుంటకు కొత్త జీవం.. కబ్జాల నుంచి సుందరవనం దిశగా!

సామాన్యుడి అస్త్రం / ఖానామెట్: కాంక్రీట్ కట్టడాల మధ్య కనుమరుగవుతున్న చెరువును కాపాడి, ప్రజలకు ఆహ్లాదాన్ని పంచే సుందరవనంగా తీర్చిదిద్దే దిశగా ఖానామెట్‌లోని తమ్మిడికుంట చెరువు పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నాయి. పనుల పురోగతిని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్, పీఏసీ చైర్మన్ ఆరెకపూడి గాంధీ ఉన్నతాధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు.చెరువు పునరుద్ధరణ, సుందరీకరణ పనులను వేగవంతం చేయాలని గాంధీ అధికారులకు సూచించారు. త్వరలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నందున నిర్దేశిత సమయంలో పనులు పూర్తి చేయాలని పేర్కొన్నారు. నాణ్యత విషయంలో ఎక్కడా రాజీపడకుండా ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాలని స్పష్టం చేశారు.చెరువు పరిధిలోని ఆక్రమణలు, నిర్మాణాలను తొలగించి విస్తీర్ణాన్ని పరిరక్షించే చర్యలు చేపట్టినట్లు గాంధీ తెలిపారు. కుంచించుకుపోయిన చెరువుకు పూర్వవైభవం తీసుకొచ్చేందుకు నాలాల పునరుద్ధరణ, చెరువు కట్ట బలోపేతం, అలుగు మరమ్మతులు చేపడుతున్నట్లు వివరించారు.

మురుగునీరు చెరువులో కలవకుండా చుట్టూ ప్రత్యేక యూజీడీ మళ్లింపు పైప్‌లైన్ ఏర్పాటు చేయడంతో పాటు ఎస్టీపీ నిర్మించనున్నట్లు తెలిపారు. చెరువు సంరక్షణ కోసం ఫెన్సింగ్, ప్రజల కోసం వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. తామర పువ్వులతో చెరువును ఆకర్షణీయంగా తీర్చిదిద్ది, కుటుంబాలు ప్రశాంతంగా గడిపే వాతావరణాన్ని కల్పిస్తామన్నారు.నగరంలో చెరువు అంటే కేవలం నీటి నిల్వ కాదు. వర్షపు నీటికి ఆశ్రయం, పక్షులకు ఆవాసం, స్థానికులకు ఊపిరి పీల్చుకునే బహిరంగ ప్రదేశం. అభివృద్ధి పనులు పూర్తయిన తర్వాత కూడా మురుగునీరు, ఆక్రమణలు తిరిగి చేరకుండా నిరంతర పర్యవేక్షణ కొనసాగితేనే ఈ ప్రయత్నానికి సార్థకత లభిస్తుంది.కార్యక్రమంలో హైడ్రా అధికారులు, నాయకులు ఎర్రగుడ్ల శ్రీనివాస్‌యాదవ్, జంగయ్య యాదవ్, రామచందర్, సర్వర్ తదితరులు పాల్గొన్నారు. 


Related News సంబంధిత వార్తలు

Advertisement 728 x 90 Banner Placehoder