- గల్ఫ్ బేకర్స్‌పై ఉప్పల్ జోన్ ఎస్‌ఓటీ ఆకస్మిక దాడి
- కృత్రిమ రంగులు, కాలం చెల్లిన పదార్థాలు, కేకులు స్వాధీనం
- నిర్వాహకుడిని అదుపులోకి తీసుకుని మేడిపల్లి పోలీసులకు అప్పగింత
సామాన్యుడి అస్త్రం / పీర్జాదిగూడ–బోడుప్పల్ : రుచికరమైన కేకులు, బేకరీ ఉత్పత్తుల ముసుగులో ప్రజారోగ్యంతో చెలగాటమాడుతున్నారన్న సమాచారంతో ఉప్పల్ జోన్ స్పెషల్ ఆపరేషన్స్ టీమ్ రంగంలోకి దిగింది. మేడిపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలోని బోడుప్పల్ రోడ్, మల్లికార్జున్‌నగర్‌లో ఉన్న ‘అమ్నామ్స్ గల్ఫ్ బేకర్స్’పై ఆకస్మికంగా దాడిచేసి అనుమానాస్పద ఆహార పదార్థాలను స్వాధీనం చేసుకుంది.
కేకుల్లో కాలం చెల్లిన రంగులు!
బేకరీలో ఆహార భద్రతా ప్రమాణాలకు విరుద్ధంగా అపరిశుభ్రమైన పరిస్థితుల్లో పదార్థాలను నిల్వ చేసి, కేకుల తయారీకి వినియోగిస్తున్నట్లు ప్రాథమిక తనిఖీలో గుర్తించినట్టు పోలీసులు తెలిపారు. అమోనియా పౌడర్, లెమన్ ఎల్లో, ఆరెంజ్ రెడ్ సహా పలు కృత్రిమ రంగులు, గడువు ముగిసిన ఫ్లేవర్ పౌడర్లు, జామ్, సాస్‌తోపాటు వాటితో తయారు చేసినట్లు అనుమానిస్తున్న కేకులను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. అయితే స్వాధీనం చేసుకున్న పదార్థాల్లో ఏవి నిషేధితమైనవి, ఏ స్థాయిలో ఆరోగ్యానికి హానికరమైనవి అనే విషయం ఆహార భద్రతా పరీక్షలు, ప్రయోగశాల నివేదికల ఆధారంగా నిర్ధారణ కావాల్సి ఉంది.
నిర్వాహకుడు అదుపులో.. మూలాలపై దర్యాప్తు
బేకరీని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్న అబ్దుల్ ముత్తలిబ్ సయ్యద్‌ను ఎస్‌ఓటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్వాధీనం చేసుకున్న పదార్థాలు, కేకులతోపాటు అతడిని మేడిపల్లి పోలీసులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసి, ఈ పదార్థాలను ఎంతకాలంగా ఉపయోగిస్తున్నారు? ఇప్పటికే ఎన్ని ఉత్పత్తులు విక్రయించారు? ముడి పదార్థాలు ఎక్కడి నుంచి వచ్చాయి? అనే కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. బేకరీలు, హోటళ్లు రుచి, రంగు పేరుతో వినియోగదారుల ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టవద్దని పోలీసులు హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘించినట్లు నిర్ధారణైతే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.