Zepto డెలివరీ బాయ్ బైక్ సీజ్.. ట్రాఫిక్ పోలీసుల తీరుపై ఆవేదన
- ఆర్డర్ తీసుకునేందుకు రోడ్డు పక్కన బైక్ నిలిపినట్లు బాధితుడి వాదన
- సమాచారం ఇవ్వకుండా వాహనాన్ని తీసుకెళ్లారని ఆరోపణ
- “నా భార్య ఆస్పత్రిలో ఉంది సార్” అని వేడుకున్నా వినలేదంటూ ఆవేదన
సామాన్యుడి అస్త్రం / హైదరాబాద్ :
పూట గడవాలంటే బైక్ ఉండాలి... ఆస్పత్రిలో ఉన్న భార్యను చూసుకోవాలన్నా చేతిలో డబ్బు ఉండాలి... కానీ ఆ రెండింటికీ ఆధారమైన బైక్‌ను ట్రాఫిక్ పోలీసులు సీజ్ చేయడంతో ఓ Zepto డెలివరీ బాయ్ రోడ్డునపడ్డాడు. “నా భార్య ఆస్పత్రిలో ఉంది సార్... బైక్ లేకపోతే పని చేయలేను” అంటూ వేడుకున్నా పోలీసులు కనికరించలేదని అతడు ఆవేదన వ్యక్తం చేశాడు.
హైదరాబాద్‌లో ఓ వినియోగదారుడి ఆర్డర్ తీసుకునేందుకు తన బైక్‌ను రోడ్డు పక్కన నిలిపినట్లు డెలివరీ బాయ్ తెలిపాడు. కొద్దిసేపటి తర్వాత బయటకు వచ్చి చూడగా వాహనం కనిపించలేదని, ట్రాఫిక్ పోలీసులు సీజ్ చేసి తీసుకెళ్లారని తెలిసిందని చెప్పాడు. బైక్‌ను ఎక్కడికి తరలిస్తున్నారు? ఏ నిబంధన కింద సీజ్ చేస్తున్నారు? అనే సమాచారం కూడా తనకు వెంటనే తెలియజేయలేదని ఆరోపించాడు.
బైక్ అంటేనే బతుకు బండి!
ఆన్‌లైన్ డెలివరీ ఉద్యోగులకు బైక్ కేవలం వాహనం కాదు.. కుటుంబాన్ని పోషించే జీవనాధారం. ఒకరోజు బైక్ లేకపోయినా ఆ రోజు ఆదాయం పోతుంది. ఆర్డర్లు పూర్తి చేయకపోతే రేటింగ్ తగ్గడంతోపాటు పని అవకాశాలపైనా ప్రభావం పడే ప్రమాదం ఉంటుంది.
ఇలాంటి పరిస్థితిలో తన భార్య ఆస్పత్రిలో ఉందని, వైద్య ఖర్చుల కోసం పని చేయాల్సి ఉందని చెప్పినా పోలీసులు తన బాధను పట్టించుకోలేదని డెలివరీ బాయ్ వాపోయాడు. జరిమానా ఉంటే చెల్లించేందుకు అవకాశం ఇవ్వకుండా వాహనాన్ని తీసుకెళ్లడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించాడు.
నిబంధనలు ముఖ్యమే.. మానవత్వం వద్దా?
ట్రాఫిక్‌కు ఆటంకం కలిగేలా వాహనాలు నిలిపితే పోలీసులు చర్యలు తీసుకోవడాన్ని ఎవరూ తప్పుపట్టరు. అయితే వాహనాన్ని తరలించే ముందు యజమానికి సమాచారం ఇచ్చారా? అక్కడ నో పార్కింగ్ బోర్డు ఉందా? ఫొటోలు లేదా వీడియో ఆధారాలు నమోదు చేశారా? జరిమానాతో సరిపెట్టకుండా బైక్‌ను ఎందుకు సీజ్ చేశారు? అనే ప్రశ్నలకు అధికారులు సమాధానం చెప్పాల్సి ఉంది.
చట్టాన్ని అమలు చేయడంలో కఠినంగా వ్యవహరించవచ్చు. కానీ అత్యవసర పరిస్థితిని వివరిస్తూ ఓ సామాన్యుడు వేడుకుంటున్నప్పుడు అతడి సమస్యను వినే కనీస మానవత్వం కూడా అవసరమని పలువురు అభిప్రాయపడుతున్నారు. గిగ్ వర్కర్ల జీవనాధారమైన వాహనాలపై చర్యలు తీసుకునేటప్పుడు పారదర్శకమైన విధానం పాటించాలని కోరుతున్నారు.
డెలివరీ బాయ్ చేస్తున్న ఆరోపణలపై సంబంధిత ట్రాఫిక్ పోలీసుల వివరణ రావాల్సి ఉంది. బైక్ ఎక్కడ, ఏ పరిస్థితుల్లో నిలిపారు? వాహనంపై గతంలో ఏవైనా పెండింగ్ చలాన్లు ఉన్నాయా? సీజ్‌కు అసలు కారణం ఏమిటి? అనే వివరాలు వెల్లడైతేనే ఘటనపై పూర్తి స్పష్టత రానుంది.