- ఒక్కో ఎంఎంటీఎస్‌కు రెండు నుంచి నాలుగు ఏసీ కోచ్‌ల ప్రతిపాదన
- తొలి విడతలో సాధారణ రైళ్లకే ఏసీ బోగీలను జతచేసే అవకాశం
- పటాన్‌చెరు మీదుగా సంగారెడ్డి వరకు విస్తరించాలనే డిమాండ్
సామాన్యుడి అస్త్రం / లింగంపల్లి : నిత్యం కిక్కిరిసిన ఎంఎంటీఎస్ రైళ్లలో ఉక్కపోతను భరిస్తూ ప్రయాణిస్తున్న లింగంపల్లి ప్రయాణికులకు ఊరట కలిగించే వార్త తెరపైకి వచ్చింది. హైదరాబాద్ ఎంఎంటీఎస్ రైళ్లలో ఏసీ కోచ్‌లను అందుబాటులోకి తీసుకొచ్చే దిశగా దక్షిణ మధ్య రైల్వే ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. రైల్వేబోర్డు నుంచి వచ్చిన ఆదేశాల మేరకు సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తూ ప్రతిపాదనలు రూపొందిస్తున్నట్లు సమాచారం.
తొలి విడతలో ప్రస్తుతం నడుస్తున్న ఒక్కో ఎంఎంటీఎస్ రైలుకు రెండు నుంచి నాలుగు ఏసీ కోచ్‌లను జతచేయాలని భావిస్తున్నారు. ప్రయాణికుల నుంచి వచ్చే స్పందన, ఆదరణను పరిశీలించిన తర్వాత రెండో విడతలో పూర్తిస్థాయి ఏసీ లోకల్ రైళ్లను ప్రవేశపెట్టే అవకాశాలను పరిశీలించనున్నారు. దేశంలోని కోచ్ ఫ్యాక్టరీల నుంచి 2027 ఏప్రిల్ నాటికి ఏసీ లోకల్ కోచ్‌లు అందుబాటులోకి వచ్చే అవకాశముందని రైల్వే వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ప్రస్తుతం లింగంపల్లి నుంచి హైదరాబాద్, ఘట్‌కేసర్ నుంచి లింగంపల్లి, ఉందానగర్ నుంచి రామచంద్రాపురం, కాచిగూడ నుంచి మేడ్చల్ మార్గాల్లో కలిపి సుమారు 70 ఎంఎంటీఎస్ సర్వీసులు నడుస్తున్నాయి. వీటిలో ప్రతిరోజూ దాదాపు 60 వేల మంది ప్రయాణిస్తున్నట్లు అంచనా. ముఖ్యంగా లింగంపల్లి మార్గంలో ఐటీ, కార్పొరేట్ ఉద్యోగులతో ఉదయం, సాయంత్రం రైళ్లు కిక్కిరిసిపోతున్నాయి.
ఏసీ కోచ్‌లు అందుబాటులోకి వస్తే లింగంపల్లి, చందానగర్, హఫీజ్‌పేట్, మియాపూర్ ప్రాంతాల ప్రయాణికులతోపాటు ఐటీ కారిడార్ ఉద్యోగులకు ప్రయోజనం కలుగుతుంది. అయితే ఏ మార్గానికి ఎన్ని కోచ్‌లు కేటాయిస్తారు? సాధారణ టికెట్ కంటే ఏసీ ప్రయాణ చార్జీ ఎంత ఉంటుంది? లింగంపల్లి మార్గానికి తొలి విడతలోనే అవకాశం దక్కుతుందా? అనే విషయాల్లో ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.
మరోవైపు ఎంఎంటీఎస్‌ను రామచంద్రాపురం నుంచి పటాన్‌చెరు మీదుగా సంగారెడ్డి వరకు విస్తరించాలనే డిమాండ్ చాలాకాలంగా వినిపిస్తోంది. ఈ విస్తరణకు అనుమతి లభిస్తే పశ్చిమ హైదరాబాద్‌తోపాటు పటాన్‌చెరు పారిశ్రామిక ప్రాంతంలోని వేలాది మంది కార్మికులు, ఉద్యోగులకు రైలు ప్రయాణం మరింత చేరువ కానుంది.