Telangana

22ఏ భూములపై భగ్గుమన్న పటాన్‌చెరు.. అమీన్‌పూర్‌లో భారీ పోరుబాట!

22ఏ భూములపై భగ్గుమన్న పటాన్‌చెరు.. అమీన్‌పూర్‌లో భారీ పోరుబాట!
  • 22ఏ నిషేధిత జాబితా బాధితుల కోసం భారీ నిరసన
  • ఆగస్టు 29న అమీన్‌పూర్‌కు మాజీ మంత్రి హరీశ్‌రావు
  • 15 వేల మందిని సమీకరించేందుకు బీఆర్‌ఎస్‌ సన్నాహాలు
సామాన్యుడి అస్త్రం / అమీన్‌పూర్ : 22ఏ నిషేధిత జాబితా భూముల వ్యవహారం పటాన్‌చెరు నియోజకవర్గంలో రాజకీయ కాక రేపుతోంది. ఏళ్ల తరబడి భూములను అనుభవిస్తున్న యజమానులు రిజిస్ట్రేషన్లు నిలిచిపోవడం, నిర్మాణ అనుమతులు రాకపోవడం, బ్యాంకు రుణాలు అందకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆరోపిస్తూ బీఆర్‌ఎస్‌ భారీ పోరాటానికి సిద్ధమైంది.
ఆగస్టు 29న అమీన్‌పూర్‌ వేదికగా నిర్వహించనున్న నిరసన కార్యక్రమానికి మాజీ మంత్రి హరీశ్‌రావు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. నియోజకవర్గంలోని 22ఏ భూ బాధితులను సమీకరించి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి ప్రకటించారు. సుమారు 15 వేల మందిని సభకు తరలించాలని బీఆర్‌ఎస్‌ లక్ష్యంగా పెట్టుకుంది.
22ఏ జాబితాలో భూములు ఎలా చేరాయి? నిజమైన పట్టాదారులు ఎంతమంది? ప్రభుత్వ భూముల పేరుతో ప్రైవేటు ఆస్తులను కూడా నిషేధిత జాబితాలో చేర్చారా? జాబితాలో మార్పులు, చేర్పుల వెనుక ఎవరున్నారు? అనే ప్రశ్నలు ఇప్పుడు తెరపైకి వస్తున్నాయి. బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని బీఆర్‌ఎస్‌ నాయకులు చెబుతున్నారు.
అయితే ఈ సమస్యను కేవలం రాజకీయ సభలకు పరిమితం చేస్తే బాధితులకు ఉపయోగం ఉండదు. సర్వే నంబర్ల వారీగా వివరాలు వెల్లడించి, అర్హులైన భూ యజమానుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలి. ప్రభుత్వ భూములను కాపాడుతూనే నిజమైన పట్టాదారులకు అన్యాయం జరగకుండా చూడాలి.
అమీన్‌పూర్‌ పోరుబాటతో 22ఏ భూముల వివాదం రాష్ట్రస్థాయి రాజకీయ అంశంగా మారే అవకాశముంది. సభలో హరీశ్‌రావు చేసే ప్రకటనలు, ప్రభుత్వం నుంచి వచ్చే స్పందనపై భూ బాధితులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Related News సంబంధిత వార్తలు

Advertisement 728 x 90 Banner Placehoder