Telangana

గుంతలో పడి బైకర్‌కు గాయాలు.. కేఆర్‌సీఆర్‌ కాలనీ రోడ్డు ఎప్పుడు బాగుపడేది?

గుంతలో పడి బైకర్‌కు గాయాలు.. కేఆర్‌సీఆర్‌ కాలనీ రోడ్డు ఎప్పుడు బాగుపడేది?
  • లోతైన గుంతను ఢీకొని అదుపుతప్పిన ద్విచక్ర వాహనం
  • రెండున్నరేళ్లుగా రోడ్డు సమస్య కొనసాగుతోందంటున్న స్థానికులు
  • తాత్కాలిక ప్యాచ్‌వర్క్‌ కాదు.. శాశ్వత మరమ్మతులు చేయాలని డిమాండ్‌
సామాన్యుడి అస్త్రం / బాచుపల్లి : పన్నులు వసూలు చేయడంలో చూపించే శ్రద్ధ.. ప్రజలకు సురక్షితమైన రోడ్లు కల్పించడంలో ఎందుకు కనిపించడం లేదు? బాచుపల్లి కేఆర్‌సీఆర్‌ కాలనీ డబుల్‌ రోడ్డులో ఏర్పడిన లోతైన గుంతను ఢీకొని ద్విచక్ర వాహనదారుడు అదుపుతప్పి కిందపడిన ఘటన స్థానికులను ఆగ్రహానికి గురిచేసింది.
స్థానికుల సమాచారం ప్రకారం విధులకు వెళ్తున్న ఓ ద్విచక్ర వాహనదారుడు రోడ్డుపై ఉన్న లోతైన గుంతను గుర్తించలేక దానిని ఢీకొట్టాడు. దీంతో బైక్‌ అదుపుతప్పి కిందపడగా అతడికి గాయాలయ్యాయి. అదృష్టవశాత్తు హెల్మెట్‌ ధరించడంతో పెను ప్రమాదం తప్పినట్లు తెలుస్తోంది.
కేఆర్‌సీఆర్‌ కాలనీ డబుల్‌ రోడ్డుతోపాటు అంతర్గత రహదారులు దాదాపు రెండున్నరేళ్లుగా గుంతలమయంగా ఉన్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. వర్షం పడితే గుంతల్లో నీరు చేరి వాటి లోతు తెలియక వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారని చెబుతున్నారు. రాత్రివేళ సరైన వీధిదీపాలు లేని ప్రాంతాల్లో పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారుతోంది.
ప్రజలు ఫిర్యాదు చేసిన ప్రతిసారీ అధికారులు కొద్దిపాటి కంకర, తారు వేసి తాత్కాలికంగా ప్యాచ్‌వర్క్‌ చేస్తున్నారని, వర్షం పడిన కొద్ది రోజులకే గుంతలు మళ్లీ బయటపడుతున్నాయని వాపోతున్నారు. ప్రజల ప్రాణాలతో ముడిపడిన సమస్యను చిన్న మరమ్మతులతో సరిపెట్టడం సరికాదని అంటున్నారు.
సీఎంసీ నిజాంపేట్‌ సర్కిల్‌ అధికారులు వెంటనే క్షేత్రస్థాయిలో పరిశీలించి రోడ్డును పూర్తిస్థాయిలో పునర్నిర్మించాలి. డ్రైనేజీ, వర్షపు నీటి ప్రవాహానికి సరైన ఏర్పాట్లు చేయకుండా కేవలం తారు వేస్తే సమస్య మళ్లీ మొదటికొస్తుంది. మరో ప్రాణం ప్రమాదంలో పడకముందే అధికారులు మేల్కొనాలని కాలనీవాసులు డిమాండ్‌ చేస్తున్నారు.

Related News సంబంధిత వార్తలు

Advertisement 728 x 90 Banner Placehoder