Crime

వృద్ధులే లక్ష్యం.. 130 ఏటీఎం కార్డులతో అంతర్రాష్ట్ర ముఠా గుట్టురట్టు

వృద్ధులే లక్ష్యం.. 130 ఏటీఎం కార్డులతో అంతర్రాష్ట్ర ముఠా గుట్టురట్టు

హైదరాబాద్‌/అమీన్‌పూర్‌:

ఏటీఎం వద్ద సహాయం చేస్తామంటూ దగ్గరవుతారు. పిన్‌ నంబర్‌ను గమనిస్తారు. మాటల్లో పెట్టి అసలు కార్డు స్థానంలో మరో కార్డు చేతిలో పెడతారు. బాధితుడు మోసాన్ని గుర్తించేలోపే ఖాతాలోని సొమ్మును కాజేస్తారు. ఇలా వృద్ధులు, అమాయక వినియోగదారులను లక్ష్యంగా చేసుకుంటున్న అంతర్రాష్ట్ర ముఠాను అమీన్‌పూర్ పోలీసులు పట్టుకున్నారు. ఆరుగురిని అరెస్టు చేయగా, మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.

కిష్టారెడ్డిపేట ఎస్‌బీఐ ఏటీఎంలో జూలై 27న జరిగిన ఘటనతో ఈ ముఠా వ్యవహారం వెలుగులోకి వచ్చింది. నగదు తీసుకోలేక ఇబ్బంది పడుతున్న వ్యక్తి వద్దకు ఇద్దరు వచ్చి సహాయం చేస్తామని నమ్మించారు. కార్డును తీసుకుని పిన్‌ తెలుసుకున్న నిందితులు, అసలు కార్డు స్థానంలో మరో కార్డు ఇచ్చి వెళ్లిపోయారు. మరుసటి రోజు తన ప్రమేయం లేకుండానే ఖాతా నుంచి రూ.65,400 డ్రా అయినట్లు సందేశాలు రావడంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించారు.

దర్యాప్తు చేపట్టిన పోలీసులు షహజాద్‌ అలియాస్‌ సజ్జా, అజ్రుద్దీన్‌, మహ్మద్‌ వసీం, సాకిబ్‌, మహ్మద్‌ అస్ఫాక్‌ ఖాన్‌, మహ్మద్‌ జాఫర్‌ను అరెస్టు చేశారు. సోహిల్‌, ముబారక్‌ పరారీలో ఉన్నారు. రాజస్థాన్‌, హర్యానాకు చెందిన ఈ ముఠా సభ్యులు నిర్మానుష్య ఏటీఎం కేంద్రాల వద్ద కాపుకాసి, ముఖ్యంగా వృద్ధులను లక్ష్యంగా చేసుకునేవారని పోలీసులు తెలిపారు.

మార్చుకున్న కార్డులతో వివిధ ఏటీఎంలలో నగదు డ్రా చేయడంతో పాటు పీఓఎస్‌ యంత్రాల ద్వారా లావాదేవీలు జరిపేవారని దర్యాప్తులో తేలింది. నిందితుల నుంచి 130 ఏటీఎం కార్డులు, రెండు పైన్‌ ల్యాబ్స్‌ పీఓఎస్‌ యంత్రాలు, మూడు ఆటోలు, ఐదు మొబైల్‌ ఫోన్లు, రూ.27,230 నగదును స్వాధీనం చేసుకున్నారు.

ఏటీఎం ముందు సహాయం చేసే వ్యక్తిలా కనిపించే అపరిచితుడే క్షణాల్లో జీవితకాల పొదుపును దోచుకునే ప్రమాదముంది. కార్డు, పిన్‌ వివరాలను ఎవరికీ చెప్పవద్దని, అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే 100కు సమాచారం ఇవ్వాలని పోలీసులు సూచించారు.

Related News సంబంధిత వార్తలు

Advertisement 728 x 90 Banner Placehoder