Crime

కొరియర్‌ బాయ్ వేషంలో ఇంట్లోకి.. మహిళపై పెప్పర్ స్ప్రే చేసి మంగళసూత్రం చోరీ

కొరియర్‌ బాయ్ వేషంలో ఇంట్లోకి.. మహిళపై పెప్పర్ స్ప్రే చేసి మంగళసూత్రం చోరీ

సామాన్యుడి అస్త్రం, మియాపూర్  : మియాపూర్‌లో కొరియర్‌ డెలివరీ పేరుతో ఇంట్లోకి ప్రవేశించి, ఒంటరిగా ఉన్న మహిళపై పెప్పర్ స్ప్రే చేసి బంగారు మంగళసూత్రాన్ని లాక్కెళ్లిన కేసును పోలీసులు ఛేదించారు. ప్రకాశం జిల్లా కనిగిరికి చెందిన షేక్ ఖాజా అర్షల్‌(20)ను అరెస్టు చేసి, నాలుగు తులాల బంగారు మంగళసూత్రాన్ని స్వాధీనం చేసుకున్నారు.

పోలీసుల కథనం ప్రకారం.. జూలై 31న బి.ఆదినారాయణ ఇచ్చిన ఫిర్యాదుతో ఘటన వెలుగులోకి వచ్చింది. ఆయుర్వేద మందుల పార్సిల్ తీసుకొచ్చిన కొరియర్‌ డెలివరీ ఏజెంట్‌గా నిందితుడు ఇంటి వద్దకు వచ్చాడు. ఆదినారాయణ భార్య ఒంటరిగా ఉన్నట్లు నిర్ధారించుకున్న తర్వాత ఇంట్లోకి ప్రవేశించాడు. ఒక్కసారిగా ఆమె ముఖంపై పెప్పర్ స్ప్రే చేసి, మెడలోని నాలుగు తులాల మంగళసూత్రాన్ని లాక్కొని పరారయ్యాడు.

అనుకోని దాడితో బాధితురాలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. సహాయం కోసం తలుపు తెరిచిన మహిళ నమ్మకాన్నే నిందితుడు నేరానికి ఆయుధంగా మార్చుకున్న తీరు స్థానికులను కలవరపరిచింది.

కేసును సవాలుగా తీసుకున్న మియాపూర్ పోలీసులు పరిసరాల్లోని సీసీటీవీ దృశ్యాలను పరిశీలించారు. సాంకేతిక, శాస్త్రీయ ఆధారాలను సేకరించి నిందితుడిని గుర్తించారు. అతడు ఆంధ్రప్రదేశ్‌లోని కనిగిరిలో ఉన్నట్లు గుర్తించి అక్కడికి వెళ్లి అరెస్టు చేశారు. అతడు ఇచ్చిన సమాచారం ఆధారంగా చోరీకి గురైన మంగళసూత్రంతో పాటు నేర సమయంలో ఉపయోగించిన ఆయుర్వేద మందుల ప్యాకెట్‌ను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

నిందితుడిపై 2025లో కనిగిరి పోలీస్‌స్టేషన్‌లో మరో రెండు కేసులు నమోదై ఉన్నట్లు విచారణలో వెల్లడైంది. ఒంటరిగా ఉన్న మహిళలను గుర్తించి, కొరియర్‌ ఏజెంట్‌గా నమ్మించి, పెప్పర్ స్ప్రే ఉపయోగించడం అతడి నేరపద్ధతిగా పోలీసులు పేర్కొన్నారు.

కూకట్‌పల్లి అదనపు డీసీపీ ఎం.సుదర్శన్, కేపీహెచ్‌బీ ఏసీపీ రవికిరణ్‌రెడ్డి పర్యవేక్షణలో మియాపూర్ ఎస్‌హెచ్‌ఓ పి.జయరామ్, డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్ డి.విజయ్‌నాయక్, ఎస్సై బి.నర్సింహారెడ్డి, సిబ్బంది ప్రేమ్‌కుమార్, యాదయ్య, పూర్ణచందర్, మల్లికార్జున్, రుషేశ్వర్ కేసును ఛేదించారు.

కొరియర్‌ లేదా డెలివరీ ఏజెంట్‌గా వచ్చే అపరిచితుల గుర్తింపును ధ్రువీకరించిన తర్వాతే తలుపు తెరవాలని, అనుమానాస్పద కదలికలు కనిపిస్తే వెంటనే 112 లేదా 100కు సమాచారం ఇవ్వాలని పోలీసులు సూచించారు.

Related News సంబంధిత వార్తలు

Advertisement 728 x 90 Banner Placehoder