- భక్తుల ఆధార్, పాన్, కరెంట్ బిల్లులతో మోసాలకు పాల్పడినట్లు ఆరోపణలు
- అమెరికాలో రూ.91 లక్షలు అప్పుగా తీసుకొని హైదరాబాద్‌కు వచ్చినట్లు ఫిర్యాదు
- కేసుల నమోదుతో భార్యతో కలిసి పరారీ?.. గాలిస్తున్న బాచుపల్లి పోలీసులు
సామాన్యుడి అస్త్రం / బాచుపల్లి : పూజలు, పీఠం, దేవుడి నగల పేరుతో భక్తుల విశ్వాసాన్నే పెట్టుబడిగా మార్చుకొని భారీ మోసాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న చామర్తి రామలచ్చారావు అలియాస్ రామశర్మ వ్యవహారం బాచుపల్లిలో సంచలనంగా మారింది. అమెరికా నుంచి హైదరాబాద్ వరకు సాగినట్లు చెబుతున్న ఈ మోసాలపై బాచుపల్లి పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.
బాధితుల ఆరోపణల ప్రకారం, రామశర్మ పూజలు నిర్వహించే సమయంలో భక్తుల నుంచి ఆధార్ కార్డులు, పాన్ కార్డులు, కరెంట్ బిల్లుల ప్రతులను సేకరించి వాటిని ఆర్థిక లావాదేవీలు, ఇతర మోసాలకు వినియోగించినట్లు చెబుతున్నారు. దేవుడికి బంగారు నగలు చేయిస్తామంటూ పలువురి నుంచి డబ్బులు తీసుకున్నాడనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి.
రామశర్మతోపాటు అతని భార్య ప్రమీలా రాణి బ్యాంకు ఖాతాల్లో భారీ మొత్తంలో లావాదేవీలు జరిగినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో గుర్తించినట్లు సమాచారం. ఈ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరెవరి ఖాతాల నుంచి బదిలీ అయింది? ఆ మొత్తాలను ఎక్కడికి మళ్లించారు? అనే కోణాల్లో పోలీసులు ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది.
అమెరికాలోనూ రామశర్మపై తీవ్రమైన ఆరోపణలు ఉన్నట్లు బాధితులు పేర్కొంటున్నారు. అక్కడ ఒక మహిళ సంతకాన్ని ఫోర్జరీ చేసి పీఠాన్ని రిజిస్టర్ చేసినట్లు, ఓ గుడి యజమాని నుంచి సుమారు రూ.91 లక్షలు అప్పుగా తీసుకుని తిరిగి చెల్లించకుండా హైదరాబాద్‌కు వచ్చేసినట్లు ఆరోపిస్తున్నారు. అమెరికా పోలీసుల దర్యాప్తులో పీఠానికి సంబంధించిన మోసం వెలుగులోకి వచ్చినట్లు సమాచారం.
మరోవైపు రామశర్మకు అన్నవరం, తుని, బెండపూడి ప్రాంతాల్లో బినామీల పేర్లతో ఆస్తులు ఉన్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఆస్తుల కొనుగోలుకు ఉపయోగించిన నిధుల మూలాలు, పత్రాల ప్రామాణికత, బ్యాంకు లావాదేవీలపై పూర్తిస్థాయి విచారణ జరపాలని బాధితులు కోరుతున్నారు.
కేసులు నమోదు కావడంతో రామశర్మ, అతని భార్య ప్రమీలా రాణి అందుబాటులో లేకుండా వెళ్లినట్లు తెలుస్తోంది. వారి ఆచూకీ కోసం బాచుపల్లి పోలీసులు గాలిస్తున్నట్లు సమాచారం. అయితే ఈ ఆరోపణలపై రామశర్మ దంపతుల వివరణ ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసుల దర్యాప్తు పూర్తయిన తర్వాతే ఆరోపణల్లోని వాస్తవాలు అధికారికంగా నిర్ధారణ కానున్నాయి.