- తవ్విన రోడ్డును పూర్తిస్థాయిలో పునరుద్ధరించని అధికారులు
- స్కూల్ పిల్లలు, పాదచారులు, వాహనదారులకు నిత్యం నరకయాతన
- సీఎంసీ ప్రజావాణిలో అధికారులకు కాలనీవాసుల వినతిపత్రం
సామాన్యుడి అస్త్రం / మియాపూర్ : డ్రైనేజీ పైప్‌లైన్ పనుల కోసం రోడ్డును తవ్విన అధికారులు.. పనులు పూర్తయిన తరువాత దానిని పునరుద్ధరించడం మరిచిపోయారా? అంటూ మియాపూర్ డివిజన్ పరిధిలోని పలు కాలనీల ప్రజలు ప్రశ్నిస్తున్నారు. నెలల తరబడి అధ్వాన రోడ్డుపై ప్రయాణిస్తూ నరకయాతన అనుభవిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మియాపూర్ డివిజన్‌లోని విడియా కాలనీ, ఎఫ్‌సీఐ కాలనీతోపాటు వైష్ణవి ఎన్‌క్లేవ్, బాలాజీ అపార్ట్‌మెంట్, అక్బర్ మాన్షన్ ప్రాంతాలకు వెళ్లే రోడ్డు పూర్తిగా దెబ్బతింది. డ్రైనేజీ పైప్‌లైన్ ఏర్పాటు కోసం అధికారులు రోడ్డును తవ్వగా, పనులు పూర్తయిన తర్వాత కూడా పూర్తిస్థాయిలో మరమ్మతులు చేపట్టలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. దీంతో రోడ్డంతా గుంతలు, మట్టి, రాళ్లతో ప్రమాదకరంగా మారిందని చెబుతున్నారు.
ఈ మార్గంలో ప్రతిరోజూ ప్రయాణించే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతుండగా, పాదచారులు అడుగుతీసి అడుగు వేయాల్సిన పరిస్థితి నెలకొందని పేర్కొన్నారు. ముఖ్యంగా స్కూల్‌కు వెళ్లే చిన్నారులు రాకపోకలు సాగించేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. వర్షం కురిసినప్పుడు పరిస్థితి మరింత దారుణంగా మారుతోందని, గుంతల్లో నీరు చేరి ప్రమాదాలకు కారణమవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
గతంలో అత్యవసర పరిస్థితిలో వచ్చిన అంబులెన్స్ కూడా ఈ రోడ్డులో ఇరుక్కుపోయిందని కాలనీవాసులు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ప్రాణాపాయ సమయంలో అంబులెన్స్ సకాలంలో గమ్యస్థానానికి చేరుకోలేని పరిస్థితి ఏర్పడితే బాధ్యత ఎవరిదని ప్రశ్నించారు.
రోడ్డు పునరుద్ధరణ పనులను వెంటనే చేపట్టాలని కోరుతూ సోమవారం సీఎంసీ నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో మియాపూర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్, శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్‌కు కాలనీవాసులు వినతిపత్రం అందజేశారు. సమస్య తీవ్రతను వివరించి, ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని తక్షణ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో శ్రీనివాస్‌రెడ్డి, సోమిరెడ్డి, వెంకటేశ్వరరావు, మాధవి తదితరులు పాల్గొన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తాత్కాలిక మరమ్మతులతో సరిపెట్టకుండా, నాణ్యతా ప్రమాణాలతో రోడ్డును పూర్తిస్థాయిలో పునరుద్ధరించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.