Telangana

తవ్వి వదిలేశారు.. మురుగు, బురదతో ప్రజలకు నరకం: MCPI(U) ఆగ్రహం

తవ్వి వదిలేశారు.. మురుగు, బురదతో ప్రజలకు నరకం: MCPI(U) ఆగ్రహం
  • డ్రైనేజీ, ఎస్‌ఎన్‌డీపీ నాలా, ఎస్‌టీపీ లైన్‌ పనులు పూర్తిచేయాలని డిమాండ్
  • పటేల్‌ చెరువు నుంచి మక్తా మహబూబ్‌ చెరువు వరకు సమస్యలపై వినతి
  • నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులు, కాంట్రాక్టర్లపై చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి

సామాన్యుడి అస్త్రం / సైబరాబాద్: అభివృద్ధి పేరుతో రోడ్లను తవ్వి నెలల తరబడి పనులు పూర్తిచేయకపోవడంతో ప్రజలు మురుగు, బురద మధ్య తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మార్క్సిస్టు కమ్యూనిస్టు పార్టీ ఆఫ్‌ ఇండియా–యునైటెడ్‌ ఆరోపించింది. అసంపూర్తిగా ఉన్న డ్రైనేజీ, ఎస్‌ఎన్‌డీపీ నాలా, ఎస్‌టీపీ లైన్‌, రహదారి పనులను యుద్ధప్రాతిపదికన పూర్తిచేయాలని కోరుతూ పార్టీ గ్రేటర్‌ హైదరాబాద్‌ కమిటీ ప్రతినిధులు సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ జి.సృజన ఐఏఎస్‌కు వినతిపత్రం అందజేశారు. మియాపూర్‌, మాదాపూర్‌, హైదర్‌నగర్‌ డివిజన్ల పరిధిలో కొన్ని పనులు నెలలుగా, మరికొన్ని మూడేళ్లుగా అసంపూర్తిగా ఉన్నాయని ప్రతినిధులు పేర్కొన్నారు. పటేల్‌ చెరువు వద్ద సరైన లెవలింగ్‌ లేకపోవడంతో మురుగునీరు నిలిచి, చిన్నపాటి వర్షానికే సమీప ఇళ్లలోకి చేరుతోందని తెలిపారు. సెయింట్‌ రీటా స్కూల్‌ నుంచి ఎఫ్‌సీఐ కాలనీ పార్క్‌, హనుమాన్‌ ఆలయ ప్రధాన రహదారి వరకు డ్రైనేజీ కోసం తవ్విన రోడ్డును పునరుద్ధరించలేదన్నారు. ఎఫ్‌సీఐ కాలనీ పార్క్‌ వెనుక డ్రైనేజీ జామ్‌తో మురుగునీరు రోడ్డుపై నిలుస్తోందని వివరించారు. మియాపూర్‌ హెడ్‌బ్యాంక్‌–నడిగడ్డతండా రహదారి ఆరు నెలలుగా అసంపూర్తిగా ఉందని ఆరోపించారు.

నడిగడ్డతండా, ఓంకార్‌నగర్‌, సుభాష్‌చంద్రబోస్‌నగర్‌లలో భూగర్భ డ్రైనేజీ, సీసీ రోడ్లు, విద్యుత్‌ స్తంభాలు ఏర్పాటు చేయాలని కోరారు. ముజఫర్‌ అహ్మద్‌నగర్‌, టీఎన్‌నగర్‌, మంజీరా రోడ్డు పరిధిలో తవ్విన రహదారులను వెంటనే పునరుద్ధరించాలని విజ్ఞప్తి చేశారు. మక్తా మహబూబ్‌ చెరువు కట్ట మీదుగా బీకే కాలనీకి వెళ్లే రహదారి గుంతలు, బురదతో అధ్వానంగా మారడంతో విద్యార్థులు, మహిళలు, వృద్ధులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. వినతిపై కమిషనర్ సానుకూలంగా స్పందించి పనులు త్వరగా పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు నాయకులు తెలిపారు. కార్యక్రమంలో తాండ్ర కళావతి, అంగడి పుష్ప, పల్లె మురళి, ఇస్లావత్‌ దశరథ్‌నాయక్‌, జి.శివాని, బి.విమల, ఇక్రాన్‌ షేక్‌, ఆకుల రమేష్‌, శ్రీధర్‌ పాల్గొన్నారు.

Related News సంబంధిత వార్తలు

Advertisement 728 x 90 Banner Placehoder