- SIR–2026 ప్రక్రియ పురోగతిని క్షేత్రస్థాయిలో పరిశీలించిన రాష్ట్ర సీఈఓ
- సవరణ పనులను వేగవంతం చేయాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు
- పారదర్శకత, ఖచ్చితత్వమే ప్రామాణికంగా పని చేయాలని సూచన
సామాన్యుడి అస్త్రం / శేరిలింగంపల్లి:
ఓటర్ల జాబితా సవరణలో చిన్న పొరపాటుకు కూడా తావివ్వొద్దని తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి.సుదర్శన్ రెడ్డి, ఐఏఎస్ అధికారులను ఆదేశించారు. శేరిలింగంపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో కొనసాగుతున్న ప్రత్యేక ఓటర్ల జాబితా తీవ్ర సవరణ—SIR–2026 ప్రక్రియను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించి, ఇప్పటివరకు జరిగిన పనుల పురోగతిని సమీక్షించారు.
ఈ సందర్భంగా శేరిలింగంపల్లి ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారి, జోనల్ కమిషనర్ నారాయణ్ అమిత్, ఐఏఎస్ సీఈఓ వెంట ఉండి నియోజకవర్గంలో కొనసాగుతున్న ఓటర్ల వివరాల సేకరణ, ధ్రువీకరణ, సవరణ కార్యక్రమాల గురించి వివరించారు. క్షేత్రస్థాయి సిబ్బంది చేపడుతున్న ఇంటింటి పరిశీలనతోపాటు దరఖాస్తుల స్వీకరణ, వివరాల నమోదు ప్రక్రియపై సుదర్శన్ రెడ్డి ఆరా తీశారు.
ఓటర్ల జాబితా సవరణ పనులు నత్తనడకన సాగకుండా మరింత వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటర్ల జాబితాలో ఉండేలా చూడటంతోపాటు అనర్హులు, మృతులు, చిరునామా మారిన వ్యక్తులకు సంబంధించిన వివరాలను ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారమే పరిశీలించాలని స్పష్టం చేశారు.
సవరణ ప్రక్రియలో పారదర్శకత, ఖచ్చితత్వం అత్యంత కీలకమని సీఈఓ పేర్కొన్నారు. క్షేత్రస్థాయి పరిశీలన నుంచి తుది జాబితా రూపకల్పన వరకు ప్రతి దశను బాధ్యతాయుతంగా నిర్వహించాలని, నమోదు చేసే ప్రతి వివరాన్ని క్షుణ్ణంగా ధ్రువీకరించాలని అధికారులను ఆదేశించారు. తొందరపాటుతో తప్పులు చోటుచేసుకుంటే అర్హులైన ఓటర్లు ఇబ్బందులు ఎదుర్కొనే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
SIR–2026 ప్రక్రియను నిరంతరం పర్యవేక్షిస్తూ, నిర్ణీత గడువులో క్రమబద్ధంగా పూర్తి చేయాలని సూచించారు. సిబ్బందికి ఎదురవుతున్న సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించి, దరఖాస్తులు పెండింగ్‌లో ఉండకుండా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ప్రజల నుంచి వచ్చే అభ్యంతరాలు, వినతులను నిబంధనలకు అనుగుణంగా పరిశీలించాలని పేర్కొన్నారు.
ఎలాంటి పొరపాట్లకు ఆస్కారం లేకుండా సవరణ ప్రక్రియను పూర్తి చేసినప్పుడే తాజా, నమ్మకమైన ఓటర్ల జాబితా సిద్ధమవుతుందని సీఈఓ స్పష్టం చేశారు. ఉన్నతాధికారుల క్షేత్రస్థాయి పర్యటనతో శేరిలింగంపల్లిలో SIR–2026 పనులు మరింత వేగం పుంజుకునే అవకాశం కనిపిస్తోంది.