ASTHRAM DAILY
Police

చందానగర్‌లో చోరీ.. రాజమండ్రికి బైక్‌లు!

  • వరుస వాహన చోరీల కేసుల్లో ఐదుగురి అరెస్టు
  • మూడు రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌లు, ఒక కేటీఎం బైక్‌ స్వాధీనం
  • 11 నకిలీ నంబర్‌ ప్లేట్లు, తాళాలు, పనిముట్లు లభ్యం

సామాన్యుడి అస్త్రం / చందానగర్‌ / సైబరాబాద్ క్రైమ్ బ్యూరో : ఇంటి ముందు నిలిపిన బైక్‌ తెల్లారేసరికి కనిపించలేదు. బాధితుడి ఫిర్యాదుతో దర్యాప్తు చేపట్టిన చందానగర్‌ పోలీసులు.. వరుస వాహన చోరీలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐదుగురిని అరెస్టు చేశారు. చోరీ చేసిన ఓ బైక్‌ను లాక్కెళ్తుండగా పట్టుకున్నారు. వారి నుంచి మూడు రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ బైక్‌లు, ఒక కేటీఎం బైక్‌తో పాటు 11 నకిలీ నంబర్‌ ప్లేట్లు, చోరీలకు ఉపయోగిస్తున్నట్లు పేర్కొన్న పనిముట్లను స్వాధీనం చేసుకున్నారు.

పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. చందానగర్‌ హుడా కాలనీలో నివసించే సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ అడెపు అజయ్‌కు చెందిన రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ క్లాసిక్‌ 350 బైక్‌ అక్టోబర్‌ 25వ తేదీ రాత్రి నుంచి 26వ తేదీ తెల్లవారుజాము మధ్యలో ఇంటి ముందు నుంచి చోరీకి గురైంది. ఆయన ఫిర్యాదుతో చందానగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

విశ్వసనీయ సమాచారం మేరకు అక్టోబర్‌ 27న చందానగర్‌ ఎంఎంటీఎస్‌ రోడ్డు సమీపంలో ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. వీరంతా ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రికి చెందినవారని పోలీసులు తెలిపారు. నిందితుల్లో చెన్నైలోని ఎంజీఆర్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలో బీటెక్‌ చదువుతున్న గడ్డం ప్రవీణ్‌ (21), ప్రైవేటు ఉద్యోగులు బురిడి గోపీచంద్‌ (20), చోడవరపు దినేశ్‌కుమార్‌ (22), విద్యార్థులు గీసాల షణ్ముఖ సత్యసాయి (21), సీరాపు దినేశ్‌కుమార్‌ (22) ఉన్నారు.

2025 డిసెంబర్‌ నుంచి సైబరాబాద్‌తో పాటు పరిసర ప్రాంతాల్లో వాహన చోరీలకు పాల్పడుతున్నట్లు విచారణలో నిందితులు తెలిపారని పోలీసులు పేర్కొన్నారు. పనిముట్లు, అదనపు తాళాలు, నకిలీ నంబర్‌ ప్లేట్లను ఉపయోగిస్తూ, చోరీ చేసిన వాహనాలను రాజమండ్రికి తరలిస్తున్నట్లు వెల్లడించారని తెలిపారు.

అజయ్‌కు చెందిన బైక్‌తో పాటు చందానగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో నమోదైన మరో రెండు కేసులకు సంబంధించిన రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ బైక్‌లు, మియాపూర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోరీకి గురైన కేటీఎం 200 డ్యూక్‌ను స్వాధీనం చేసుకున్నారు. కటింగ్‌ ప్లయర్లు, స్పానర్లు, బైక్‌ల హ్యాండిల్‌ లాక్‌లు, పెట్రోల్‌ ట్యాంక్‌ లాక్‌లు కూడా లభించినట్లు పోలీసులు వివరించారు.

అక్టోబర్‌ 27న రాత్రి 11.30 గంటలకు నిందితులను అరెస్టు చేసి న్యాయస్థానం ఎదుట హాజరుపరిచినట్లు తెలిపారు. మిగిలిన చోరీ వాహనాల ఆచూకీతో పాటు ఇతర పెండింగ్‌ కేసుల్లో వీరి ప్రమేయంపై దర్యాప్తు కొనసాగుతోంది.

వాహనాలను సురక్షితంగా పార్కింగ్‌ చేసుకోవాలని, అనుమానాస్పద కదలికలు కనిపిస్తే సమీప పోలీస్‌ స్టేషన్‌కు లేదా 112కు సమాచారం ఇవ్వాలని పోలీసులు సూచించారు. చందానగర్‌ ఎస్‌హెచ్‌వో పర్యవేక్షణలో పనిచేసిన క్రైమ్‌ బృందం, ఆర్‌సీపురం సీసీఎస్‌ సిబ్బందిని ఏసీపీ అభినందించారు.

Journalist
Jairam
Journalist

Related News సంబంధిత వార్తలు

Advertisement 728 x 90 Banner Placehoder