Police

నేరగాళ్లకు నో ఛాన్స్.. చందానగర్‌ కీలక కూడళ్లలో 26 సీసీ కెమెరాలు!

నేరగాళ్లకు నో ఛాన్స్.. చందానగర్‌ కీలక కూడళ్లలో 26 సీసీ కెమెరాలు!
  • ఏడు ప్రధాన ప్రాంతాల్లో 26 సీసీ కెమెరాల ఏర్పాటుకు చర్యలు
  • కెమెరాల కోసం రూ.3 లక్షలు విరాళంగా అందించిన మిర్యాల రాఘవరావు
  • వారం రోజుల్లో పనులు పూర్తిచేస్తామని పోలీసుల వెల్లడి

సామాన్యుడి అస్త్రం / చందానగర్: నేరం జరిగిన తర్వాత ఆధారాల కోసం వెతికే పరిస్థితికి బదులుగా, నేరాలకు ముందుగానే అడ్డుకట్ట వేసే లక్ష్యంతో చందానగర్ పోలీసులు కీలక చర్యలు చేపట్టారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ప్రజల భద్రత, నేరాల నియంత్రణ, దర్యాప్తు సామర్థ్యాన్ని పెంచేందుకు చందానగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ప్రధాన కూడళ్లలో 26 సీసీ కెమెరాలను ఏర్పాటు చేయనున్నారు.

డీసీపీ చింతమనేని శ్రీనివాస్‌, ఏసీపీ సీ.వై.శ్రీనివాస్‌కుమార్ సూచనల మేరకు కెమెరాల ఏర్పాటుకు అవసరమైన ప్రాంతాలను గుర్తించారు. బీఎస్‌ఎన్‌ఎల్‌ క్రాస్‌రోడ్‌, హుడా కాలనీ క్రాస్‌రోడ్‌, ఆర్‌యూబీ క్రాస్‌రోడ్‌, నల్లగండ్ల అండర్‌బ్రిడ్జి, లింగంపల్లి రైల్వేస్టేషన్‌, లింగంపల్లి రైతుబజార్‌, గోపన్‌పల్లి క్రాస్‌రోడ్‌లలో కెమెరాలను అమర్చనున్నారు.

ప్రజల రాకపోకలు ఎక్కువగా ఉండటం, రైల్వేస్టేషన్‌, మార్కెట్‌, ప్రధాన కూడళ్లు, అండర్‌బ్రిడ్జి వంటి ప్రాంతాలు కావడంతో నేరాల నివారణ పరంగా ఇవి అత్యంత కీలకమైనవిగా పోలీసులు గుర్తించారు. కెమెరాల దృశ్యాలు అనుమానితుల కదలికలను గుర్తించడంతోపాటు దొంగతనాలు, చైన్‌స్నాచింగ్‌, వాహనాల చోరీలు, ఇతర నేరాలను వేగంగా ఛేదించేందుకు ఉపయోగపడతాయని తెలిపారు.

ఈ కెమెరాల ఏర్పాటుకు అవసరమైన నిధుల కోసం పోలీసులు చేసిన విజ్ఞప్తికి చందానగర్‌కు చెందిన మిర్యాల రాఘవరావు స్పందించారు. ప్రజల భద్రత కోసం తనవంతు సహకారంగా రూ.3 లక్షల చెక్కును విరాళంగా అందజేశారు. సామాజిక బాధ్యతతో ముందుకొచ్చిన రాఘవరావుకు చందానగర్ పోలీసులు కృతజ్ఞతలు తెలిపారు.

సీసీ కెమెరాల ఏర్పాటు పనులను వారం రోజుల్లో పూర్తిచేసి వినియోగంలోకి తీసుకొస్తామని వెల్లడించారు. ప్రజలు, వ్యాపారులు, అపార్ట్‌మెంట్‌ సంఘాలు, కాలనీ సంక్షేమ సంఘాలు కూడా తమ పరిసరాల్లోని రహదారులు కనిపించేలా నాణ్యమైన కెమెరాలు ఏర్పాటు చేయాలని కోరారు. పోలీసులకు ప్రజల సహకారం తోడైతే చందానగర్‌ను మరింత సురక్షిత ప్రాంతంగా తీర్చిదిద్దవచ్చని పేర్కొన్నారు.

Related News సంబంధిత వార్తలు

Advertisement 728 x 90 Banner Placehoder