- కానిస్టేబుల్ నుంచి ఇన్‌స్పెక్టర్ స్థాయి వరకు 216 మందికి రివార్డులు
- ఆస్తి నేరాల నియంత్రణ, కేసుల ఛేదనపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సీపీ ఆదేశం
- సీసీటీవీ విశ్లేషణ, డిజిటల్ సాధనాలు విస్తృతంగా వినియోగించాలని సూచన
సామాన్యుడి అస్త్రం / సైబరాబాద్ : నేరాల నివారణ, కీలక కేసుల ఛేదన, శాంతిభద్రతల పరిరక్షణలో ప్రతిభ కనబరిచిన సైబరాబాద్ పోలీసు సిబ్బందిని ప్రోత్సహిస్తూ కమిషనరేట్ ఆధ్వర్యంలో ‘రివార్డ్ మేళా’ నిర్వహించారు. గచ్చిబౌలిలోని సైబరాబాద్ కమిషనరేట్ ప్రధాన సమావేశ మందిరంలో గురువారం ఉదయం 11.30 గంటలకు జరిగిన కార్యక్రమంలో పోలీస్ కమిషనర్ డాక్టర్ ఎం.రమేష్ ఐపీఎస్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కానిస్టేబుల్ నుంచి ఇన్‌స్పెక్టర్ స్థాయి వరకు ఎంపికైన 216 మంది సిబ్బందికి సీపీ రివార్డులు అందజేశారు. వీరిలో శేరిలింగంపల్లి శాంతిభద్రతల విభాగం నుంచి 46 మంది, కూకట్‌పల్లి నుంచి 70 మంది, కుత్బుల్లాపూర్ నుంచి 32 మంది ఉన్నారు. స్పెషల్ ఆపరేషన్స్ టీమ్‌కు చెందిన 18 మంది, సెంట్రల్ క్రైమ్ స్టేషన్ నుంచి 43 మంది, సైబర్‌క్రైమ్ పోలీస్‌స్టేషన్‌కు చెందిన ఏడుగురు రివార్డులు అందుకున్నారు. ఒక కేసు విజయవంతంగా ఛేదించడం వెనుక గంటల తరబడి శ్రమ, సాంకేతిక విశ్లేషణ, సమష్టి కృషి దాగి ఉంటుందని ఈ సందర్భంగా సీపీ పేర్కొన్నారు. రివార్డులు అందుకున్న సిబ్బందిని అభినందిస్తూ, ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు ప్రతి పోలీసు అధికారి నిజాయితీ, వృత్తి నైపుణ్యం, అంకితభావంతో పనిచేయాలని సూచించారు.

ఆస్తి సంబంధిత నేరాల నివారణ, ఛేదనపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. కేసులను వేగంగా ఛేదించేందుకు ఆధునిక సాంకేతికత, సీసీటీవీ దృశ్యాల విశ్లేషణ, సాంకేతిక దర్యాప్తు పద్ధతులు, డిజిటల్ సాధనాలను సమర్థంగా ఉపయోగించుకోవాలని చెప్పారు. నేరస్థులు, నేరాల తీరు, ఛేదించిన కేసులకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు నవీకరించాలని సూచించారు. గతంలో ఛేదించిన కేసులను అధ్యయనం చేయడం ద్వారా నేరస్థుల కార్యాచరణ పద్ధతులను అర్థం చేసుకోవడంతోపాటు దర్యాప్తు నైపుణ్యాన్ని పెంచుకోవచ్చని సీపీ తెలిపారు. కార్యక్రమంలో అడ్మిన్ డీసీపీ టి.అన్నపూర్ణ, కుత్బుల్లాపూర్ డీసీపీ ఎన్.కోటిరెడ్డి, కూకట్‌పల్లి డీసీపీ రితిరాజ్, క్రైమ్స్–ఈఓడబ్ల్యూ డీసీపీ ఎ.ముత్యంరెడ్డి, ఎస్‌ఓటీ డీసీపీ శోభన్‌కుమార్, ఏసీపీలు, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
