- కేసు దర్యాప్తు చేసి ఛార్జ్‌షీట్ దాఖలు చేసేందుకు లంచం డిమాండ్
- ఎస్సై కార్యాలయ టేబుల్ డ్రాయర్ నుంచి ₹75 వేలు స్వాధీనం
- ఎస్సై బాలరాజుతోపాటు కానిస్టేబుల్ రాఘవేంద్ర కుమార్ అరెస్ట్
సామాన్యుడి అస్త్రం / చందానగర్ : న్యాయం కోసం పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన వ్యక్తి నుంచి లంచం వసూలు చేస్తున్నారన్న ఆరోపణలపై అవినీతి నిరోధక శాఖ అధికారులు చందానగర్ పోలీస్ స్టేషన్‌లో దాడులు నిర్వహించారు. కేసు దర్యాప్తు చేసి ఛార్జ్‌షీట్ దాఖలు చేసేందుకు ఫిర్యాదుదారుడి నుంచి ₹75 వేల లంచం తీసుకుంటూ సబ్‌ఇన్‌స్పెక్టర్ బండెల బాలరాజు ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కారు. ఈ వ్యవహారంలో పోలీస్ కానిస్టేబుల్, స్టేషన్ రైటర్ బొట్ట రాఘవేంద్ర కుమార్‌ను కూడా ఏసీబీ అదుపులోకి తీసుకుంది.
ఏసీబీ అధికారిక ప్రకటన ప్రకారం… చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన క్రైమ్ నంబర్ 696/2026 కేసును దర్యాప్తు చేసి, ఛార్జ్‌షీట్ దాఖలు చేసేందుకు ఎస్సై బాలరాజు ఫిర్యాదుదారుడి నుంచి లంచం డిమాండ్ చేశారు. అందులో భాగంగా శుక్రవారం ₹75 వేలు స్వీకరిస్తున్న సమయంలో రంగారెడ్డి రేంజ్ ఏసీబీ అధికారులు పక్కా సమాచారంతో దాడి చేసి పట్టుకున్నారు.
లంచంగా తీసుకున్న ₹75 వేల నగదును ఎస్సై బాలరాజు కార్యాలయంలోని టేబుల్ డ్రాయర్ నుంచి అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇదే పనికి సంబంధించి బాలరాజు గతంలోనే ₹20 వేల నగదు తీసుకున్నట్లు ఏసీబీ పేర్కొంది. కానిస్టేబుల్ రాఘవేంద్ర కుమార్ కూడా యూపీఐ ద్వారా ₹10 వేలు స్వీకరించినట్లు వెల్లడించింది. దీంతో ఈ వ్యవహారంలో ఇప్పటివరకు స్వీకరించిన మొత్తం ₹1.05 లక్షలకు చేరినట్లు అధికారిక వివరాలు స్పష్టం చేస్తున్నాయి.
ప్రజలకు రక్షణ కల్పించి, న్యాయం చేయాల్సిన పోలీస్ స్టేషన్‌లోనే కేసు దర్యాప్తు పేరుతో లంచం వసూలు చేయడం స్థానికంగా తీవ్ర చర్చకు దారితీసింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరినీ అరెస్ట్ చేసి, హైదరాబాద్‌లోని ఏసీబీ కేసుల ప్రత్యేక న్యాయస్థానం ముందు హాజరుపరిచి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించనున్నట్లు అధికారులు తెలిపారు. కేసుపై తదుపరి దర్యాప్తు కొనసాగుతోంది.
ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే ఏసీబీ టోల్‌ఫ్రీ నంబర్ 1064 లేదా వాట్సాప్ నంబర్ 9440446106 ద్వారా ఫిర్యాదు చేయాలని అధికారులు సూచించారు. ఫిర్యాదుదారుల వివరాలను గోప్యంగా ఉంచుతామని భరోసా ఇచ్చారు.