- రసాయన వ్యర్థాలు వదిలారనే ఆరోపణ.. 10 టన్నులకు పైగా చేపలు మృతి
- తీవ్రంగా నష్టపోయిన మత్స్యకార కుటుంబాలు
- సమగ్ర విచారణతోపాటు నష్టపరిహారం ఇవ్వాలని జనసేన డిమాండ్
సామాన్యుడి అస్త్రం / బోడుప్పల్ : మత్స్యకార కుటుంబాలకు జీవనాధారమైన రాచెరువు ఒక్క రాత్రిలోనే చేపల శ్మశానంగా మారింది. మేడ్చల్ నియోజకవర్గం, బోడుప్పల్ సర్కిల్ పరిధిలోని చెరువులో అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు రసాయన వ్యర్థాలను వదిలారనే ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. ఈ ఘటనలో 10 టన్నులకు పైగా చేపలు మృతి చెందినట్లు స్థానికులు, మత్స్యకారులు చెబుతున్నారు.
చెరువు నీటిపై పెద్ద సంఖ్యలో చేపలు తేలియాడుతూ కనిపించడంతో మత్స్యకారులు దిగ్భ్రాంతికి గురయ్యారు. నెలల తరబడి పెట్టుబడులు పెట్టి పెంచిన చేపలు ఒక్కసారిగా మృతి చెందడంతో తమకు భారీ నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చేపల మృతికి రసాయన కాలుష్యమే కారణమా? మరేదైనా కారణం ఉందా? అనే విషయాన్ని అధికారులు శాస్త్రీయంగా నిర్ధారించాల్సి ఉంది.
అర్ధరాత్రి వ్యర్థాలు వదిలిందెవరు?
చెరువులోకి రసాయన వ్యర్థాలు ఎలా చేరాయి? ట్యాంకర్ల ద్వారా తీసుకొచ్చి వదిలారా? సమీప పరిశ్రమల నుంచి రహస్యంగా పైపుల ద్వారా విడుదల చేశారా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. చెరువు పరిసరాల్లోని సీసీటీవీ దృశ్యాలు, ట్యాంకర్ల రాకపోకలను పరిశీలిస్తే బాధ్యులను గుర్తించే అవకాశం ఉంటుందని స్థానికులు అంటున్నారు.
కాలుష్య నియంత్రణ మండలి, మత్స్యశాఖ, మున్సిపల్, రెవెన్యూ అధికారులు సంయుక్తంగా చెరువు నీరు, మృతి చెందిన చేపల నమూనాలను సేకరించి పరీక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. కాలుష్యానికి కారణమైన రసాయనం ఏమిటో గుర్తించడంతోపాటు ప్రజల ఆరోగ్యంపై ప్రభావం ఉంటుందా అనే విషయాన్ని వెల్లడించాలని కోరుతున్నారు.
మత్స్యకారులను ప్రభుత్వం ఆదుకోవాలి
చేపల మృతితో మత్స్యకారుల పెట్టుబడులు నీటిపాలయ్యాయని జనసేన పార్టీ అధికార ప్రతినిధి వంగరి సాయికుమార్ పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం వెంటనే స్పందించి ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. బాధిత మత్స్యకారుల నష్టాన్ని అంచనా వేసి పూర్తి నష్టపరిహారం అందించాలని కోరారు.
రాత్రివేళల్లో చెరువులు, నాలాల్లో పారిశ్రామిక వ్యర్థాలను వదిలే వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని సూచించారు. బాధ్యులను గుర్తించి పర్యావరణ, క్రిమినల్ చట్టాల కింద కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
కేవలం మృతి చెందిన చేపలను తొలగించడంతో సమస్య పరిష్కారం కాదని స్థానికులు అంటున్నారు. చెరువు నీటిని శుద్ధి చేసి, భవిష్యత్తులో మళ్లీ కాలుష్యం జరగకుండా శాశ్వత చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. రాచెరువులో చేపల మృతికి గల కారణంపై సంబంధిత శాఖల అధికారిక నివేదిక రావాల్సి ఉంది.