- మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు చేతుల మీదుగా ఆసుపత్రి ప్రారంభం
- ఆధునిక సదుపాయాలతో నాణ్యమైన చర్మ వైద్య సేవలు
- హాజరైన కాంగ్రెస్ నేతలు, నిర్వాహకులకు అభినందనలు
సామాన్యుడి అస్త్రం / నిజాంపేట్ : కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని నిజాంపేట్‌లో కొత్తగా ఏర్పాటు చేసిన ‘స్కిన్ అటెలిర్ హాస్పిటల్’ ప్రారంభోత్సవం శనివారం ఘనంగా జరిగింది. డీసీసీ అధ్యక్షుడు తోటకూర వజ్రేష్ యాదవ్ కుమార్తె ఏర్పాటు చేసిన ఈ ఆసుపత్రిని ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఇన్‌చార్జి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.
కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి కొలన్ హన్మంత్‌రెడ్డి, కూకట్‌పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి బండి రమేష్, ఉప్పల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి పరమేశ్వర్‌రెడ్డి, టీపీసీసీ మాజీ ప్రధాన కార్యదర్శి నర్సారెడ్డి భూపతిరెడ్డి తదితరులు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
తొలుత అతిథులు జ్యోతి ప్రజ్వలన చేసి ఆసుపత్రిని అధికారికంగా ప్రారంభించారు. అనంతరం ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన వైద్య విభాగాలు, ఆధునిక పరికరాలు, రోగులకు అందించనున్న సేవలను పరిశీలించారు. ఆసుపత్రి నిర్వాహకులను అభినందించి, వైద్య సేవల రంగంలో విజయవంతంగా ముందుకు సాగాలని ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ.. వేగంగా విస్తరిస్తున్న నిజాంపేట్ పరిసర ప్రాంతాల్లో ప్రత్యేక చర్మ వైద్య సేవలకు డిమాండ్ పెరుగుతోందన్నారు. ఆధునిక వైద్య సదుపాయాలతో నాణ్యమైన చికిత్సను స్థానికులకు అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమని పేర్కొన్నారు. వైద్యం వ్యాపార ధోరణికి పరిమితం కాకుండా సేవా దృక్పథంతో సాగాలని సూచించారు. సామాన్యులకు అందుబాటులో ఉండేలా వైద్య సేవలు అందిస్తూ ప్రజల విశ్వాసాన్ని పొందాలని నిర్వాహకులకు సూచించారు.
చర్మ సంబంధిత సమస్యలకు మెరుగైన చికిత్స అందించడంతోపాటు రోగుల పట్ల బాధ్యత, పారదర్శకత, పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆకాంక్షించారు. ఆసుపత్రి నిజాంపేట్‌తోపాటు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకు ఉపయోగపడాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో వివిధ డివిజన్ల కాంగ్రెస్ అధ్యక్షులు, సీనియర్ నాయకులు, పార్టీ కార్యకర్తలు, ఆసుపత్రి సిబ్బంది, స్థానికులు తదితరులు పాల్గొన్నారు.