- బందోబస్తును క్షేత్రస్థాయిలో పరిశీలించిన సైబరాబాద్ సీపీ డా. ఎం. రమేష్
- జగద్గిరిగుట్ట–సూరారం ఊరేగింపు మార్గంలో సీపీ పరిశీలన
- భద్రతతోపాటు ట్రాఫిక్ నియంత్రణపై ప్రత్యేక దృష్టి
- సీసీఎస్, ఎస్‌ఓటీ కార్యాలయాలు సహా పలు అభివృద్ధి పనుల సమీక్ష
సామాన్యుడి అస్త్రం / జగద్గిరిగుట్ట : మిలాద్ ఉన్ నబీ ఊరేగింపు ప్రశాంత వాతావరణంలో జరిగేలా సైబరాబాద్ పోలీసులు ముందస్తు చర్యలను ముమ్మరం చేశారు. వేడుకల సందర్భంగా చిన్న పొరపాటుకూ తావులేకుండా పటిష్ఠమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డా. ఎం. రమేష్ అధికారులను ఆదేశించారు.
మిలాద్ ఊరేగింపు నేపథ్యంలో జగద్గిరిగుట్ట, సూరారం పోలీస్‌స్టేషన్ల పరిధిలోని ప్రధాన మార్గాలను సీపీ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఊరేగింపు సాగే రహదారులు, ముఖ్య కూడళ్లు, ట్రాఫిక్ రద్దీ ఏర్పడే ప్రాంతాలు, భద్రతాపరంగా అప్రమత్తంగా ఉండాల్సిన ప్రదేశాలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.
అనంతరం జగద్గిరిగుట్ట పోలీస్‌స్టేషన్‌లో పోలీసు అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఊరేగింపు ప్రారంభం నుంచి ముగిసే వరకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సిబ్బంది మోహరింపు, ట్రాఫిక్ మళ్లింపు, అత్యవసర పరిస్థితుల్లో స్పందించాల్సిన విధానంపై చర్చించారు. అవాంఛనీయ ఘటనలకు అవకాశం ఇవ్వకుండా ముందస్తు సమాచార వ్యవస్థను బలోపేతం చేయాలని సూచించారు.
ప్రజలకు ఇబ్బందులు కలగొద్దు
ఉత్సవాల్లో పాల్గొనేవారి భద్రత ఎంత ముఖ్యమో, సాధారణ ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడటం కూడా అంతే ముఖ్యమని సీపీ స్పష్టం చేశారు. ఊరేగింపు కారణంగా ప్రధాన రహదారులపై ట్రాఫిక్ నిలిచిపోకుండా ప్రత్యామ్నాయ మార్గాలను ముందుగానే గుర్తించాలని, అవసరమైన ప్రాంతాల్లో ట్రాఫిక్ సిబ్బందిని అదనంగా నియమించాలని ఆదేశించారు. స్థానిక నిర్వాహకులతో సమన్వయం చేసుకుంటూ విధులు నిర్వర్తించాలని సూచించారు.
తదుపరి కుత్బుల్లాపూర్ జోన్ పరిధిలోని సీసీఎస్, ఎస్‌ఓటీ కార్యాలయాలను సీపీ సందర్శించారు. ఆయా విభాగాల పనితీరు, భద్రతా ఏర్పాట్లు, పెండింగ్‌లో ఉన్న ముఖ్యమైన అంశాలపై సంబంధిత అధికారులతో సమీక్ష జరిపారు.
గాజులరామారం ప్రాంతంలో సైబరాబాద్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న పెట్రోల్ బంకు పనులను కూడా పరిశీలించారు. నిర్మాణ ప్రగతి, మౌలిక వసతులు, అందుబాటులోకి తీసుకురావడానికి అవసరమైన చర్యలపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.
అలాగే జగద్గిరిగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలో సైబరాబాద్ పోలీస్ సీఏఆర్ హెడ్‌క్వార్టర్స్ కోసం ప్రభుత్వం కొత్తగా కేటాయించిన స్థలాన్ని పరిశీలించారు. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా చేపట్టాల్సిన నిర్మాణాలు, అభివృద్ధి పనులపై అధికారులతో చర్చించారు.
ఈ పర్యటనలో కుత్బుల్లాపూర్ డీసీపీ ఎన్. కోటిరెడ్డి, కూకట్‌పల్లి డీసీపీ రితిరాజ్, ఎస్‌ఓటీ డీసీపీ శోభన్‌కుమార్, సీఏఆర్ హెడ్‌క్వార్టర్స్ డీసీపీ సంజీవ్, కుత్బుల్లాపూర్ అదనపు డీసీపీ పురుషోత్తం, ఏసీపీ పబాల గంగిరెడ్డి తదితర అధికారులు పాల్గొన్నారు.