- విద్యార్థుల భద్రతకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని యాజమాన్యాలకు ఆదేశం
- ఫైర్ ఎన్‌వోసీలను రెండేళ్లకోసారి రెన్యూవల్ చేసుకునేలా వెసులుబాటు
- నకిలీ పత్రాల సూత్రధారులపై లోతైన విచారణ.. బాధ్యులపై చర్యలు
సామాన్యుడి అస్త్రం / హైదరాబాద్ : ఫేక్ ఫైర్ ఎన్‌వోసీలతో విద్యార్థుల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టొద్దని హైడ్రా, ఇంటర్ బోర్డు కళాశాలల యాజమాన్యాలను హెచ్చరించాయి. విద్యార్థులు, బోధనా సిబ్బంది భద్రతకే అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని, అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు అందరూ సురక్షితంగా బయటపడేలా కళాశాల భవనాల్లో అవసరమైన ఏర్పాట్లు చేయాలని స్పష్టం చేశాయి.
నకిలీ ఫైర్ ఎన్‌వోసీల వ్యవహారంలో హైడ్రా కేసులు నమోదు చేయడం, సంబంధిత కళాశాలలపై ఇంటర్ బోర్డు చర్యలు చేపట్టిన నేపథ్యంలో కళాశాలల నిర్వాహకులతో రెండు శాఖలు సంయుక్త సమావేశం నిర్వహించాయి. హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్, ఇంటర్ బోర్డు కార్యదర్శి అభిలాష అభినవ్ ఈ సమావేశంలో యాజమాన్యాల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. నకిలీ ఎన్‌వోసీలను సమర్పించడానికి దారితీసిన పరిస్థితులపై ఆరా తీశారు.
ఫేక్ ఫైర్ ఎన్‌వోసీల పేరుతో కళాశాలలను ఇబ్బంది పెట్టడం తమ ఉద్దేశం కాదని అధికారులు స్పష్టం చేశారు. అయితే విద్యార్థుల భద్రత విషయంలో మాత్రం రాజీపడే ప్రసక్తే లేదన్నారు. ప్రతి కళాశాలలో రెండో మెట్ల మార్గం ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పాత భవనాల్లో రెండో మెట్ల మార్గం ఏర్పాటు చేయడానికి అవకాశం లేకపోతే ప్రత్యామ్నాయ భద్రతా మార్గాలను పరిశీలించాలని తెలిపారు.
కళాశాలల యాజమాన్యాల విజ్ఞప్తి మేరకు ఫైర్ ఎన్‌వోసీలను ప్రతి ఏడాది కాకుండా రెండేళ్లకోసారి రెన్యూవల్ చేసుకునే వెసులుబాటు కల్పిస్తామని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ప్రకటించారు. ఎన్‌వోసీల జారీ ప్రక్రియను మరింత సరళతరం చేయడంతోపాటు హైడ్రా అనుమతి పొందిన ఏజెన్సీల ద్వారా ధ్రువపత్రాలు జారీ చేసే ప్రతిపాదనను కూడా పరిశీలిస్తామని చెప్పారు.
బ్రోకర్లను నమ్మొద్దు
ఫైర్ ఎన్‌వోసీలు, వాటి రెన్యూవల్స్ కోసం hydraafirenoc.telangana.gov.in వెబ్‌సైట్ ద్వారా నేరుగా దరఖాస్తు చేసుకోవాలని రంగనాథ్ సూచించారు. బ్రోకర్లను నమ్మి మోసపోవద్దని హెచ్చరించారు. దరఖాస్తుల స్వీకరణ, ఫీజుల చెల్లింపు, అనుమతుల మంజూరు, పాత అనుమతుల పునరుద్ధరణ తదితర ప్రక్రియలన్నీ ఆన్‌లైన్‌లోనే జరిగేలా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.
జీహెచ్‌ఎంసీతోపాటు సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ సహా కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ పరిధిలోని మూడు కార్పొరేషన్లలో ఉన్నవారు ఇదే విధానంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఇందుకోసం ఎవరూ హైడ్రా కార్యాలయానికి రావాల్సిన అవసరం లేదన్నారు.
నకిలీ ఫైర్ ఎన్‌వోసీల వ్యవహారంలో సూత్రధారులు, పాత్రధారులు ఎవరో గుర్తించేందుకు లోతైన విచారణ జరుగుతోందని, బాధ్యులపై తప్పకుండా చర్యలు ఉంటాయని హైడ్రా కమిషనర్ స్పష్టం చేశారు. కళాశాలల యాజమాన్యాలు తమ వద్ద ఉన్న ఫైర్ ఎన్‌వోసీలు అసలైనవా, నకిలీవా అనేది స్వయంగా పరిశీలించుకోవాలని సూచించారు.
ఫేక్ ఫైర్ ఎన్‌వోసీలు సమర్పించిన కళాశాలలకు విధించిన రూ.8 లక్షల అపరాధ రుసుముపై పునరాలోచన చేస్తామని ఇంటర్ బోర్డు కార్యదర్శి అభిలాష అభినవ్ తెలిపారు. సమావేశంలో హైడ్రా అడిషనల్ డైరెక్టర్ వర్ల పాపయ్య అగ్నిమాపక నిబంధనలను వివరించగా, ఇంటర్ బోర్డు సంయుక్త కార్యదర్శి వసుంధర సమావేశ వివరాలను వెల్లడించారు.