Police

జెండా సాక్షిగా ఖాకీ సంకల్పం.. సైబరాబాద్‌లో ఘనంగా స్వాతంత్య్ర వేడుకలు!

జెండా సాక్షిగా ఖాకీ సంకల్పం.. సైబరాబాద్‌లో ఘనంగా స్వాతంత్య్ర వేడుకలు!
  • జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన సీపీ డా. ఎం. రమేష్
  • ప్రతిభ చూపిన 19 మంది పోలీసులకు సేవా పతకాలు
  • ‘వికసిత్ భారత్‌–2047’కు సురక్షిత సమాజమే పునాది

సామాన్యుడి అస్త్రం / సైబరాబాద్ : దేశానికి రక్షణగా సరిహద్దుల్లో సైనికుడు నిలబడితే… నగరంలో ప్రజల ప్రాణాలకు, ఆస్తులకు భరోసాగా పోలీసులు విధులు నిర్వహిస్తుంటారు. అలాంటి ఖాకీ దళం మధ్య సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు దేశభక్తి ఉప్పొంగేలా ఘనంగా జరిగాయి. సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డాక్టర్ ఎం.రమేష్, ఐపీఎస్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. జాతీయ గీతాలాపనతో కమిషనరేట్ ప్రాంగణం మార్మోగింది. పోలీస్ అధికారులు, సిబ్బందితోపాటు వారి కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో హాజరై స్వాతంత్య్ర వేడుకల్లో భాగస్వాములయ్యారు.


ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ, బలమైన ప్రజాస్వామ్య వ్యవస్థతో భారత్ స్వయం సమృద్ధి దిశగా వేగంగా అడుగులు వేస్తోందన్నారు. దేశం నిర్దేశించుకున్న ‘వికసిత్ భారత్‌–2047’ లక్ష్యం సాధించాలంటే ప్రజలు ప్రశాంతంగా జీవించగలిగే సురక్షిత వాతావరణం అవసరమని చెప్పారు. శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ, మహిళలు–చిన్నారుల భద్రత, సైబర్ నేరాల కట్టడి వంటి అంశాల్లో పోలీసుల బాధ్యత మరింత పెరిగిందని పేర్కొన్నారు. పండుగ రోజు కావొచ్చు… అర్ధరాత్రి కావొచ్చు… వర్షం, ఎండ, కుటుంబ అవసరాలను పక్కనపెట్టి ప్రజల కోసం విధులు నిర్వహిస్తున్న పోలీసుల సేవలను ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. విధి నిర్వహణలో ప్రతిభ, క్రమశిక్షణ, అంకితభావం కనబరిచిన నలుగురు పోలీసులకు ఉత్తమ సేవా పతకాలు, మరో 15 మందికి సేవా పతకాలను అందజేసి అభినందించారు. అవార్డులు బాధ్యతను మరింత పెంచుతాయని, ప్రతి పోలీసు ప్రజలకు అందుబాటులో ఉంటూ శాఖ గౌరవాన్ని నిలబెట్టాలని సూచించారు.


అనంతరం పోలీస్ సిబ్బంది పిల్లలకు బహుమతులు అందజేశారు. నిత్యం విధుల్లో బిజీగా ఉండే పోలీసుల కుటుంబాలను వేడుకల్లో భాగస్వాములను చేయడం కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వేడుకల్లో జాయింట్ సీపీ ట్రాఫిక్ సన్‌ప్రీత్ సింగ్, ఐపీఎస్, డీసీపీ అడ్మిన్ టి.అన్నపూర్ణ, కూకట్‌పల్లి డీసీపీ రితిరాజ్, ఐపీఎస్, కుత్బుల్లాపూర్ డీసీపీ ఎన్.కోటి రెడ్డి, శేరిలింగంపల్లి డీసీపీ సీహెచ్ శ్రీనివాస్, స్పెషల్ బ్రాంచ్ డీసీపీ వైవీఎస్ సుధీంద్ర, ఎస్‌ఓటీ డీసీపీ డి.శోభన్ కుమార్, సీఏఆర్ హెడ్‌క్వార్టర్స్ డీసీపీ సంజీవ్‌తోపాటు ఏడీసీపీలు, ఏసీపీలు, ఇతర ఉన్నతాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Related News సంబంధిత వార్తలు

Advertisement 728 x 90 Banner Placehoder