- 300 మంది పోలీసులతో కట్టుదిట్టమైన బందోబస్తు
- బాంబ్ డిస్పోజల్ బృందాలతో సభా ప్రాంగణంలో తనిఖీలు
- ట్రాఫిక్ మళ్లింపులు, ప్రత్యేక పార్కింగ్‌కు కార్యాచరణ
సామాన్యుడి అస్త్రం / కేపీహెచ్‌బీ : ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి పాల్గొననున్న ఇందిరమ్మ ఎల్‌ఐజీ టవర్స్ శంకుస్థాపన కార్యక్రమానికి సైబరాబాద్ పోలీసులు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. కేపీహెచ్‌బీ పోలీస్‌స్టేషన్ పరిధిలో గురువారం నిర్వహించనున్న ఈ కార్యక్రమానికి ప్రజలు, ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో హాజరయ్యే అవకాశం ఉండటంతో సభా ప్రాంగణాన్ని పోలీసు నిఘాలోకి తీసుకున్నారు. సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డాక్టర్ ఎం.రమేష్ బుధవారం సభా ప్రాంగణాన్ని పరిశీలించి బందోబస్తు ఏర్పాట్లపై అధికారులకు కీలక సూచనలు చేశారు. బాంబ్ డిస్పోజల్ బృందాలతో ప్రాంగణం, వేదిక, ప్రవేశ మార్గాలు, పార్కింగ్ ప్రాంతాల్లో విస్తృత తనిఖీలు నిర్వహించారు. అనుమానాస్పద వస్తువులు, వ్యక్తుల కదలికలపై ప్రత్యేక నిఘా ఉంచాలని ఆదేశించారు.
300 మందితో భద్రతా వలయం
ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా సుమారు 300 మంది పోలీసు అధికారులు, సిబ్బందిని బందోబస్తులో మోహరించనున్నారు. సభా ప్రాంగణంతోపాటు సీఎం కాన్వాయ్ ప్రయాణించే మార్గాలు, ప్రవేశ–నిష్క్రమణ ద్వారాలు, ప్రజలు కూర్చునే ప్రాంతాల్లో ప్రత్యేక భద్రత ఏర్పాటు చేస్తున్నారు. జనసమ్మర్థాన్ని నియంత్రించేందుకు బారికేడ్లు, ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేయనున్నారు. అత్యవసర పరిస్థితులు ఎదురైతే ప్రజలను సురక్షితంగా తరలించేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను సిద్ధం చేస్తున్నారు. సభకు వచ్చే వారిని తనిఖీ చేసిన తర్వాతే ప్రాంగణంలోకి అనుమతించేలా చర్యలు చేపట్టారు.

ట్రాఫిక్‌కు ప్రత్యేక కార్యాచరణ
సీఎం కాన్వాయ్, సభకు వచ్చే వాహనాలతో సాధారణ ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా ప్రత్యేక ప్రణాళికను అమలు చేస్తున్నారు. రద్దీ ఏర్పడే ప్రాంతాలను ముందుగానే గుర్తించి అవసరమైన చోట్ల ట్రాఫిక్ మళ్లింపులు చేపట్టనున్నారు. ప్రజలు, పార్టీ శ్రేణుల వాహనాల కోసం ప్రత్యేక పార్కింగ్ ప్రదేశాలు కేటాయిస్తున్నారు. పోలీసు, ట్రాఫిక్, జీహెచ్‌ఎంసీ, ఆర్‌అండ్‌బీ, రెవెన్యూ శాఖల అధికారులు సమన్వయంతో ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యమంత్రి పర్యటన ప్రశాంతంగా, సురక్షితంగా జరిగేందుకు ప్రజలు, వాహనదారులు పోలీసులకు సహకరించాలని సీపీ కోరారు.
