Police

సైబరాబాద్‌లో 60% సైబర్ కేసులు పెట్టుబడి మోసాలే!.. విద్యార్థులకు డిజిటల్ అలర్ట్

సైబరాబాద్‌లో 60% సైబర్ కేసులు పెట్టుబడి మోసాలే!.. విద్యార్థులకు డిజిటల్ అలర్ట్

సామాన్యుడి అస్త్రం / గచ్చిబౌలి: విద్యార్థి చేతిలోని మొబైల్ ఇప్పుడు తరగతి గది, బ్యాంకు, వినోద ప్రపంచం కూడా. అదే మొబైల్‌లో కనిపించే ఒక నకిలీ పెట్టుబడి ప్రకటన కుటుంబం దాచుకున్న పొదుపును క్షణాల్లో మాయం చేయగలదు. ఈ ప్రమాదంపై యువతను అప్రమత్తం చేసేందుకు సైబరాబాద్ పోలీసులు నెల రోజుల సైబర్ భద్రతా ఉద్యమానికి శ్రీకారం చుట్టారు.  తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో మార్గదర్శకత్వంలో, సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ సహకారంతో ‘సురక్షా కా తిరంగా–టువర్డ్స్ ఎ సైబర్ ఇండిపెండెంట్ తెలంగాణ’ కార్యక్రమాన్ని గచ్చిబౌలిలోని ఇంజినీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆడిటోరియంలో ప్రారంభించారు. వివిధ ఇంజినీరింగ్ కళాశాలలకు చెందిన సుమారు 800 మంది విద్యార్థులు పాల్గొన్నారు. సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డాక్టర్ ఎం.రమేష్ మాట్లాడుతూ సైబర్ నేరాలపై అవగాహనే అత్యంత బలమైన రక్షణ కవచమన్నారు. సైబరాబాద్‌లో నమోదవుతున్న సైబర్ కేసుల్లో దాదాపు 60 శాతం పెట్టుబడి, ట్రేడింగ్ మోసాలేనని వెల్లడించారు. అసాధారణ లాభాలు ఇస్తామనే ప్రకటనలను నమ్మవద్దని, పెట్టుబడి ప్లాట్‌ఫామ్‌లు, సలహాదారుల విశ్వసనీయతను నిర్ధారించుకోవాలని సూచించారు. ప్రచార పోస్టర్లు, సైబర్ భద్రతా వీడియోను ఆయన ఆవిష్కరించారు.


ముఖ్య అతిథిగా పాల్గొన్న సినీనటి అంజలి విద్యార్థులతో మాట్లాడుతూ ‘థింక్ బిఫోర్ యూ క్లిక్’ సందేశాన్ని ఎప్పుడూ గుర్తుంచుకోవాలన్నారు. మోసానికి గురైతే వెంటనే 1930కు కాల్ చేయాలని లేదా జాతీయ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్‌లో ఫిర్యాదు చేయాలని సూచించారు. సైబర్ క్రైమ్స్ డీసీపీ కె.పుష్ప నకిలీ సోషల్ మీడియా ప్రకటనలు, వాట్సాప్–టెలిగ్రామ్ గ్రూపులు, ప్రముఖుల ఏఐ వీడియోలు, నకిలీ ట్రేడింగ్ యాప్‌ల ద్వారా జరిగే మోసాలను వివరించారు. మోసగాళ్లు భయం, అవగాహనలేమి, అత్యాశ, తొందర, నమ్మకాన్ని ఉపయోగించుకుంటారని ‘F.I.G.H.T.’ ఫార్ములా ద్వారా వివరించారు.

నెల రోజులపాటు కళాశాలల్లో వారాలవారీగా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. విద్యార్థి తనను తాను కాపాడుకోవడంతో ఆగకుండా కుటుంబాన్ని, సమాజాన్ని అప్రమత్తం చేసినప్పుడే నిజమైన ‘సైబర్ అంబాసిడర్’గా మారగలడని అధికారులు పేర్కొన్నారు.


Related News సంబంధిత వార్తలు

Advertisement 728 x 90 Banner Placehoder