సామాన్యుడి అస్త్రం / నిజాంపేట్: వర్షం పడితే రోడ్డుపై నిలిచిపోయే నీరు.. ఆ నీటిలో కనిపించకుండా పోయే గుంతలు.. దెబ్బతిన్న రహదారులపై నిత్యం సాగే ప్రమాదకర ప్రయాణం నిజాంపేట్ ప్రజలు, వాహనదారులు ఎదుర్కొంటున్న ఈ సమస్యలకు పరిష్కారం చూపేందుకు అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టారు. నిజాంపేట్ డిప్యూటీ కమిషనర్ సాబెర్, డీఈ, ఏఈలతో కలిసి మియాపూర్ ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్ ఇన్‌స్పెక్టర్ బుధవారం పలు సమస్యాత్మక ప్రాంతాలను పరిశీలించారు. పట్టణ పరిధిలోని ప్రధాన వాటర్‌లాగింగ్ పాయింట్లు, రోడ్లపై ఏర్పడిన గుంతలు, దెబ్బతిన్న మార్గాలు, వర్షపు నీటి ప్రవాహానికి అడ్డంకిగా మారుతున్న నాలా ప్రాంతాలను అధికారులకు చూపించారు. వర్షపు నీటితో నిండిన రోడ్డులో గుంత ఎంత లోతుగా ఉందో తెలియక ద్విచక్ర వాహనదారులు ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉంటుంది. ట్రాఫిక్ రద్దీలో వాహనాలు నెమ్మదించడం వల్ల ఉద్యోగులు, విద్యార్థులు సకాలంలో గమ్యస్థానాలకు చేరుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఈ సమస్యలు కేవలం ట్రాఫిక్‌కు సంబంధించినవి కాదని, ప్రజల రోజువారీ జీవితం, భద్రతతో ముడిపడి ఉన్నాయని అధికారులు గుర్తించారు.

సీఎంఆర్ షాపింగ్ మాల్ సమీపంలోని ప్రధాన వాటర్‌లాగింగ్ పాయింట్ వద్ద తక్షణ చర్యలు చేపట్టారు. అక్కడున్న మ్యాన్‌హోల్ కవర్‌ను మార్చడంతో పాటు వర్షపు నీరు నిరంతరంగా లోపలికి వెళ్లేలా దానిని కొత్త క్యాచ్‌పిట్‌గా రూపొందించారు. దీంతో ఆ ప్రాంతంలో నీరు వేగంగా తొలగిపోయే అవకాశం ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. పరిశీలన సందర్భంగా గుర్తించిన పెండింగ్ పనులను వీలైనంత త్వరగా పూర్తి చేస్తామని డిప్యూటీ కమిషనర్ సాబెర్ హామీ ఇచ్చినట్లు మియాపూర్ ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. సంబంధిత విభాగాలు సమన్వయంతో పనిచేసి రోడ్ల మరమ్మతులు, నాలాల శుభ్రత, నీటి ప్రవాహ మార్గాల పునరుద్ధరణ చేపట్టాలని నిర్ణయించారు. అధికారుల క్షేత్ర పరిశీలన మొదటి అడుగు మాత్రమే. గుర్తించిన ప్రతి గుంత పూడ్చి, ప్రతి వాటర్‌లాగింగ్ పాయింట్‌కు శాశ్వత పరిష్కారం చూపినప్పుడే ప్రజలకు నిజమైన ఉపశమనం లభిస్తుంది.