ASTHRAM DAILY
Crime

ఎండీఎంఏ డ్రగ్స్ తో పట్టుబడిన ఫొటోగ్రాఫర్‌

  • కారులో ఎండీఎంఏ.. గ్రాము రూ.10 వేలు!
  • ఖాజాగూడ–నానక్‌రామ్‌గూడ సర్వీసు రోడ్డులో ఎక్సైజ్‌ ఎస్టీఎఫ్‌ దాడి
  • 4.45 గ్రాముల ఎండీఎంఏతో పట్టుబడిన ఫొటోగ్రాఫర్‌
  • కారు, డిజిటల్‌ త్రాసు, రెండు సెల్‌ఫోన్లు స్వాధీనం
  • ఒకరి అరెస్టు.. పరారీలో మరో ఇద్దరు

సామాన్యుడి అస్త్రం / గచ్చిబౌలి క్రైమ్ : వృత్తిరీత్యా ఫొటోగ్రాఫర్‌, వీడియోగ్రాఫర్‌.. అదనపు ఆదాయం కోసం మాదకద్రవ్యాల విక్రయాలు సాగిస్తున్నట్లు ఎక్సైజ్‌ అధికారుల గుర్తింపు. కారులో ఎండీఎంఏ ఉంచుకుని అమ్మేందుకు సిద్ధంగా ఉన్న ఆకుల సాయిరామ్‌ను ఎక్సైజ్‌ స్పెషల్‌ టాస్క్‌ఫోర్స్‌ (ఎస్టీఎఫ్‌) బృందం పట్టుకుంది. ఖాజాగూడ–నానక్‌రామ్‌గూడ సర్వీసు రోడ్డు వద్ద నిర్వహించిన దాడిలో అతడి నుంచి 4.45 గ్రాముల ఎండీఎంఏ, ఎరుపు రంగు వోక్స్‌వ్యాగన్‌ పోలో కారు, చిన్న డిజిటల్‌ త్రాసు, రెండు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకుంది. ఈ కేసులో మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు అధికారులు తెలిపారు.

రూ.25 వేలకు కొనుగోలు.. గ్రాముల లెక్కన విక్రయం

ఎక్సైజ్‌ అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. రాజమండ్రి ప్రాంతానికి చెందిన ఆకుల సాయిరామ్‌, రామిరెడ్డి మహేశ్‌రెడ్డి, తాండ్ర హరిశ్చంద్ర ప్రస్తుతం మణికొండలో నివాసం ఉంటున్నారు. ఫొటోగ్రఫీ, వీడియోగ్రఫీ పనులు చేసే సాయిరామ్‌ సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో మాదకద్రవ్యాల విక్రయాలకు పాల్పడుతున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
మహేశ్‌రెడ్డి, హరిశ్చంద్ర నుంచి రూ.25 వేలకు ఎండీఎంఏ కొనుగోలు చేసిన సాయిరామ్‌.. దానిని చిన్న డిజిటల్‌ త్రాసుతో తూకం వేసి గ్రాముకు రూ.10 వేల చొప్పున నగరంలోని యువత, ఇతర వినియోగదారులకు విక్రయిస్తున్నట్లు తెలిపారు. ఇదే క్రమంలో ఖాజాగూడ–నానక్‌రామ్‌గూడ సర్వీసు రోడ్డు వద్ద కారులో మత్తుపదార్థాన్ని ఉంచుకుని విక్రయించేందుకు సిద్ధంగా ఉండగా ఎస్టీఎఫ్‌ బృందం అదుపులోకి తీసుకున్నట్లు వివరించారు.


కొండాపూర్‌ ఎక్సైజ్‌ పోలీసులకు అప్పగింత

అరెస్టు చేసిన సాయిరామ్‌తో పాటు స్వాధీనం చేసుకున్న ఎండీఎంఏ, కారు, ఇతర వస్తువులను తదుపరి విచారణ నిమిత్తం కొండాపూర్‌ ఎక్సైజ్‌ పోలీసులకు అప్పగించారు. పరారీలో ఉన్న మహేశ్‌రెడ్డి, హరిశ్చంద్ర కోసం ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

మాదకద్రవ్యాల అక్రమ రవాణా, విక్రయాలను అరికట్టాలన్న ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ అవినాష్‌ మోహంతి ఆదేశాల మేరకు ఈ దాడి నిర్వహించినట్లు వెల్లడించారు. ఎస్టీఎఫ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎస్‌.రమేశ్‌ ఆధ్వర్యంలో సంతోష్‌, ప్రసాద్‌, ప్రభు, సతీశ్‌, రాహుల్‌ తనిఖీల్లో పాల్గొన్నారు. మత్తుపదార్థాలను పట్టుకున్న బృందాన్ని ఉన్నతాధికారులు అభినందించారు.
Journalist
Jairam
Journalist

Related News సంబంధిత వార్తలు

Advertisement 728 x 90 Banner Placehoder