- సెప్టెంబర్ 13న ఎంబీ గార్డెన్స్‌లో ‘తెలంగాణ రాష్ట్ర శంఖారావం’ సభ
- సభా ప్రాంగణానికి ‘పద్మశ్రీ వనజీవి రామయ్య ప్రాంగణం’గా నామకరణం
- ఖమ్మం కేబుల్ బ్రిడ్జికి ‘వనజీవి రామయ్య వారధి’గా పేరు పెట్టాలని డిమాండ్
సామాన్యుడి అస్త్రం / ఖమ్మం:
తెలంగాణలో జనసేన పార్టీ భవిష్యత్ రాజకీయ కార్యాచరణకు ఖమ్మం వేదికగా సమరశంఖం పూరించబోతోందని పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, ఖమ్మం–నల్గొండ–వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి డాక్టర్ గడల శ్రీనివాసరావు ప్రకటించారు. సెప్టెంబర్ 13న ఖమ్మం కాల్వఒడ్డులోని ఎంబీ గార్డెన్స్‌లో నిర్వహించనున్న భారీ బహిరంగ సభకు ‘తెలంగాణ రాష్ట్ర శంఖారావం’గా నామకరణం చేసినట్లు తెలిపారు. జనసైనికులు, వీర మహిళలు, పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
శుక్రవారం ఎంబీ గార్డెన్స్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులతో ప్రత్యేకంగా నిర్వహించిన ‘లంచ్ మీట్’లో గడల శ్రీనివాసరావు మాట్లాడారు. తెలంగాణలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, ఉమ్మడి ఖమ్మం జిల్లా అభివృద్ధి, నిరుద్యోగులు–పట్టభద్రుల ఇబ్బందులు, జనసేన పార్టీ భవిష్యత్ కార్యాచరణపై మీడియాతో చిట్‌చాట్ చేశారు.
తెలంగాణ అగ్రనేతల రాక
ఈ సభకు జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి రామ్ తాళ్లూరి, పార్టీ ఉపాధ్యక్షుడు మహేందర్‌రెడ్డి, తెలంగాణ రాష్ట్ర ఇన్‌చార్జి నేమూరి శంకర్‌గౌడ్, తెలంగాణ ప్రచార కార్యదర్శి ఆర్‌కే సాగర్‌తోపాటు రాష్ట్రస్థాయి ముఖ్య నాయకులు హాజరవుతారని గడల వెల్లడించారు. తెలంగాణలో జనసేన బలాన్ని చాటిచెప్పేలా సభను నిర్వహించనున్నామని, ప్రతి జనసైనికుడు దీనిని తన కార్యక్రమంగా భావించి విజయవంతం చేయాలని కోరారు.
వనజీవి రామయ్యకు అరుదైన గౌరవం
సెప్టెంబర్ 13న సభ జరిగే ఎంబీ గార్డెన్స్ ప్రాంగణానికి పర్యావరణ ప్రేమికుడు, పద్మశ్రీ పురస్కార గ్రహీత వనజీవి రామయ్య గౌరవార్థం ‘పద్మశ్రీ వనజీవి రామయ్య ప్రాంగణం’గా నామకరణం చేస్తున్నట్లు ప్రకటించారు. కోట్లాది మొక్కలు నాటి, పర్యావరణ పరిరక్షణనే జీవిత లక్ష్యంగా మార్చుకుని ఖమ్మం జిల్లాకు దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చిన వనజీవి రామయ్య సేవలను భావితరాలకు పరిచయం చేయాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.
ఖమ్మం నగరానికి ప్రతిష్టాత్మకంగా నిలిచిన కేబుల్ బ్రిడ్జికి ‘వనజీవి రామయ్య వారధి’గా ప్రభుత్వం తక్షణమే పేరు పెట్టాలని డిమాండ్ చేశారు. రామయ్య సేవలను కేవలం మాటలతో కొనియాడటం కాకుండా, ఆయన పేరు శాశ్వతంగా నిలిచే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలన్నారు.
ముగ్గురు మంత్రులున్నా సమస్యలు ఎందుకు తీరడం లేదు?
ఉమ్మడి ఖమ్మం జిల్లాకు ముగ్గురు మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ జిల్లా ప్రజల సమస్యలు మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉన్నాయని గడల శ్రీనివాసరావు తీవ్రంగా విమర్శించారు. అధికార పదవులు ఉన్నా జిల్లా సమగ్ర అభివృద్ధిపై చిత్తశుద్ధి కనిపించడం లేదని ఆరోపించారు. నిరుద్యోగ యువత, ఉద్యోగులు, పట్టభద్రులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంలో మంత్రులు పూర్తిగా విఫలమయ్యారని ధ్వజమెత్తారు.
ప్రజలు అధికారం ఇచ్చింది పదవులను ఆస్వాదించడానికి కాదని, తమ సమస్యలను పరిష్కరించడానికేనని గుర్తుచేశారు. ముగ్గురు మంత్రులు ఉన్న జిల్లాలోనే ప్రజలు కనీస సమస్యల పరిష్కారం కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సి రావడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమన్నారు.
పట్టభద్రుల పక్షాన పోరాటం
నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు, ఉద్యోగులకు న్యాయం, పట్టభద్రుల హక్కుల పరిరక్షణే లక్ష్యంగా జనసేన పార్టీ పనిచేస్తుందని గడల స్పష్టం చేశారు. రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీలకు ప్రత్యామ్నాయంగా నిజమైన ప్రజాగొంతుకను శాసనమండలికి పంపించాల్సిన అవసరం ఉందన్నారు. సెప్టెంబర్ 13న జరిగే ‘తెలంగాణ రాష్ట్ర శంఖారావం’ సభ ద్వారా పార్టీ భవిష్యత్ రాజకీయ కార్యాచరణను ప్రజల ముందుంచనున్నట్లు వెల్లడించారు.
ఈ సమావేశంలో జనసేన పార్టీ నాయకులు రాము యాదవ్, ఖమ్మం జిల్లా కోఆర్డినేటర్ మిర్యాల రామకృష్ణ, సత్తుపల్లి నియోజకవర్గ ఇన్‌చార్జి బండి నరేష్, జిల్లా నాయకులు, వివిధ విభాగాల ప్రతినిధులు, వీర మహిళలు, కార్యకర్తలు, ప్రింట్–ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.