- ఎమ్మెల్యే కాలనీలో ఐదడుగుల మేర రోడ్డు ఆక్రమణ జరిగిందని ఆరోపణ
- పరిశీలనకు వెళ్లిన జీహెచ్‌ఎంసీ అధికారులను కత్తితో బెదిరించినట్లు ఫిర్యాదు
- నూకారపు రామకృష్ణపై ఫిలింనగర్ పోలీస్‌స్టేషన్‌లో క్రిమినల్ కేసు
సామాన్యుడి అస్త్రం / బంజారాహిల్స్ : ప్రజలకు చెందిన రహదారిని ఆక్రమించవద్దని చెప్పేందుకు వెళ్లిన జీహెచ్‌ఎంసీ టౌన్‌ప్లానింగ్ సిబ్బందికే కత్తి బెదిరింపులు ఎదురయ్యాయి. “నా జోలికి వస్తే అడ్డంగా నరికేస్తా” అంటూ విధుల్లో ఉన్న అధికారులను బెదిరించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న నూకారపు రామకృష్ణపై ఫిలింనగర్ పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు.
ఐదడుగుల రోడ్డుపై ఆక్రమణ!
బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12లోని ఎమ్మెల్యే కాలనీ ప్రధాన రహదారి వద్ద ప్లాట్ నంబర్ 224(ఏ)లో రామకృష్ణకు సుమారు 200 గజాల స్థలం ఉన్నట్లు సమాచారం. వారం రోజులుగా స్థలం చుట్టూ ప్రహరీ నిర్మిస్తున్న ఆయన, ప్లాట్‌కు కుడివైపున ఉన్న రోడ్ నంబర్ 6లోకి సుమారు ఐదడుగుల మేర ముందుకు వచ్చి నిర్మాణం చేపట్టినట్లు స్థానికులు ఆరోపించారు.
ఫిర్యాదుతో రంగంలోకి అధికారులు
రోడ్డు ఆక్రమణపై ఎమ్మెల్యే కాలనీ అధ్యక్షుడు నారాయణరెడ్డితోపాటు కాలనీ సభ్యులు జీహెచ్‌ఎంసీ, హైడ్రా అధికారులకు ఫిర్యాదు చేశారు. దీనిపై పరిశీలన జరిపేందుకు జీహెచ్‌ఎంసీ సర్కిల్-18 టౌన్‌ప్లానింగ్ విభాగం సెక్షన్ అధికారి సాయికిరణ్‌తోపాటు చంద్రయ్య, శివసాయి శుక్రవారం సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
ప్రశ్నిస్తే కత్తి బెదిరింపు
సొసైటీ లేఅవుట్ ప్రకారం అక్కడ 40 అడుగుల రహదారి ఉండాలని అధికారులు వివరించారు. ఇప్పటికే రోడ్డు సుమారు పది అడుగులు కుంచించుకుపోయిందని, ప్రహరీని మరింత ముందుకు నిర్మించవద్దని సూచించారు. ఈ సందర్భంగా రామకృష్ణ ఆగ్రహానికి గురై, కత్తితో బెదిరిస్తూ న్యూసెన్స్‌కు పాల్పడినట్లు టౌన్‌ప్లానింగ్ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది.
అధికారులకే రక్షణ లేదా?
విధి నిర్వహణలో ఉన్న సిబ్బందిని బెదిరించిన ఘటనను జీహెచ్‌ఎంసీ వర్గాలు తీవ్రంగా పరిగణిస్తున్నాయి. ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన ఫిలింనగర్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రభుత్వ స్థలాలు, ప్రజా రహదారులను రక్షించాల్సిన అధికారులకే ఇలాంటి బెదిరింపులు ఎదురైతే ఆక్రమణల నియంత్రణ ఎలా సాధ్యమవుతుందన్న ప్రశ్న ఇప్పుడు స్థానికులను కలవరపెడుతోంది.