- ప్రమాదంగా చిత్రీకరించి హత్య చేయాలంటూ సందేశాలు పంపినట్లు ఆరోపణ
- వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ చాటింగ్ స్క్రీన్‌షాట్లు పోలీసులకు అందజేత
- జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు.. ఖమ్మం రూరల్ పోలీసులకు కేసు బదిలీ
సామాన్యుడి అస్త్రం / ఖమ్మం : జీవితాంతం తోడుగా నిలవాల్సిన భార్యే తన ప్రాణాలకు ముప్పుగా మారిందంటూ ఓ భర్త పోలీసులను ఆశ్రయించిన ఘటన మహబూబాబాద్, ఖమ్మం జిల్లాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. భార్య మొబైల్‌లో కనిపించిన వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ సందేశాలు తన హత్యకు జరుగుతున్న కుట్రను బయటపెట్టాయని బాధితుడు ఆరోపించాడు. అతను సమర్పించిన చాటింగ్ స్క్రీన్‌షాట్ల ఆధారంగా పోలీసులు జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఫోన్ తెరిస్తే హత్య చాటింగ్!
డోర్నకల్ మండలం చిలుకోడు గ్రామానికి చెందిన గాదే రాజేశ్వరరావు ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఉద్యోగం చేస్తున్నాడు. 2016లో సూర్యాపేట జిల్లా రాఘవాపురానికి చెందిన యువతిని వివాహం చేసుకున్న అతనికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. గత నెల 27న మధ్యాహ్నం భోజనం కోసం ఇంటికి వెళ్లినప్పుడు భార్య మరో వ్యక్తితో సన్నిహితంగా ఉండటాన్ని గమనించినట్లు రాజేశ్వరరావు తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ విషయాన్ని పెద్దల సమక్షంలో మాట్లాడేందుకు మరుసటి రోజు అన్నను తీసుకొచ్చే ప్రయత్నంలో ఉండగా, భార్యతో కనిపించిన వ్యక్తి తనను వెంబడించినట్లు ఆరోపించాడు.

‘ఇంట్లో కాదు.. ప్రమాదంలా కనిపించాలి’
అనుమానంతో భార్య మొబైల్‌ను పరిశీలించగా దిగ్భ్రాంతికర సందేశాలు కనిపించాయని బాధితుడు తెలిపాడు. ఇంట్లో హత్య చేయవద్దని, బయట ప్రమాదంగా కనిపించేలా చంపాలని పురిమెట్ల సైదులు అనే వ్యక్తికి భార్య సందేశాలు పంపినట్లు ఆరోపించాడు. సంబంధిత వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ చాటింగ్ స్క్రీన్‌షాట్లను పోలీసులకు అందజేశాడు.
జీరో ఎఫ్‌ఐఆర్‌తో దర్యాప్తు
ప్రాణరక్షణ కల్పించాలని కోరుతూ ఈ నెల 1న డోర్నకల్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి కేసును ఖమ్మం రూరల్ పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు. బాధితుడి ఆరోపణలు, డిజిటల్ ఆధారాల ప్రామాణికతతోపాటు అన్ని కోణాల్లో విచారణ జరుపుతామని పోలీసులు తెలిపారు. ఆరోపణలపై సంబంధిత వ్యక్తుల వాదన తెలియాల్సి ఉంది.