Telangana

ఎదురెదురుగా టిప్పర్లు.. విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొట్టిన భారీ వాహనం!

ఎదురెదురుగా టిప్పర్లు.. విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొట్టిన భారీ వాహనం!
  • ఐడీఏ బొల్లారం ప్రధాన రహదారిపై తెల్లవారుజామున ఘటన
  • రోడ్డుపై, పరిశ్రమ ఆవరణలో విరిగిపడిన విద్యుత్‌ స్తంభం
  • విద్యుత్‌ సరఫరా నిలిపివేత.. జనరేటర్లతో పరిశ్రమల ఉత్పత్తి
సామాన్యుడి అస్త్రం / ఐడీఏ బొల్లారం : ఐడీఏ బొల్లారం ప్రధాన రహదారిపై ఆదివారం తెల్లవారుజామున పెను ప్రమాదం త్రుటిలో తప్పింది. స్థానిక శీఫా రెమిడీస్‌ పరిశ్రమ సమీపంలో రెండు టిప్పర్లు ఎదురెదురుగా రావడంతో ప్రమాదాన్ని నివారించే ప్రయత్నంలో ఓ టిప్పర్‌ డ్రైవర్‌ రోడ్డు పక్కనున్న విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొట్టినట్లు స్థానికులు తెలిపారు.
టిప్పర్‌ బలంగా ఢీకొట్టడంతో విద్యుత్‌ స్తంభం విరిగి కొంత భాగం రహదారిపై, మరికొంత పరిశ్రమ ఆవరణలో పడిపోయింది. ఘటన జరిగిన సమయంలో రహదారిపై ప్రజలు, పరిశ్రమ కార్మికులు ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. రద్దీ సమయంలో ఇదే ప్రమాదం జరిగి ఉంటే పరిస్థితి తీవ్రంగా ఉండేదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రమాదాన్ని గమనించిన స్థానికులు అప్రమత్తమై అటువైపు వస్తున్న వాహనాలను నిలిపివేశారు. అనంతరం పోలీసులతోపాటు ట్రాన్స్‌కో అధికారులకు సమాచారం అందించారు. ఈ మార్గంలో రాత్రింబవళ్లు భారీ వాహనాల రాకపోకలు కొనసాగుతుండటంతో ట్రాన్స్‌కో అధికారులు వెంటనే స్పందించి విద్యుత్‌ సరఫరాను నిలిపివేశారు. దీంతో విద్యుత్‌ తీగల కారణంగా మరో ప్రమాదం జరగకుండా నివారించగలిగారు.
మెయిన్‌లైన్‌ విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడటంతో పరిసరాల్లోని పలు పరిశ్రమలు జనరేటర్ల సాయంతో ఉత్పత్తి కార్యకలాపాలను కొనసాగించాల్సి వచ్చింది. విరిగిపోయిన విద్యుత్‌ స్తంభాన్ని తొలగించి, సరఫరాను పునరుద్ధరించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.
భారీ వాహనాల వేగాన్ని నియంత్రించడంతోపాటు పరిశ్రమల ప్రాంతంలో రాత్రివేళ పర్యవేక్షణ పెంచాలని స్థానికులు కోరుతున్నారు. ప్రమాదానికి దారితీసిన పరిస్థితులు, సంబంధిత వాహనాల వివరాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Related News సంబంధిత వార్తలు

Advertisement 728 x 90 Banner Placehoder