Crime

ఏటీఎం పగలగొట్టేందుకు మూడు గంటల యత్నం.. ఇద్దరు అరెస్టు!

ఏటీఎం పగలగొట్టేందుకు మూడు గంటల యత్నం.. ఇద్దరు అరెస్టు!
  • మియాపూర్‌ క్రాస్‌రోడ్డులోని కోటక్‌ మహీంద్రా ఏటీఎంపై దాడి
  • నగదు చోరీలో విఫలం.. బ్యాకప్‌ బ్యాటరీలు మాయం
  • ఇద్దరిని అరెస్టు చేసిన పోలీసులు.. పరారీలో మరో నిందితుడు

సామాన్యుడి అస్త్రం / మియాపూర్ : సులభంగా డబ్బు సంపాదించాలనే ఆశతో ఏటీఎంను పగలగొట్టి నగదు దోచుకునేందుకు ప్రయత్నించిన ముఠా ఆటను మియాపూర్‌ పోలీసులు కట్టించారు. సీసీటీవీ దృశ్యాలు, సాంకేతిక ఆధారాల సాయంతో ఇద్దరు నిందితులను అరెస్టు చేయగా, మరో వ్యక్తి పరారీలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. పోలీసుల వివరాల ప్రకారం.. ఆగస్టు 11న తెల్లవారుజామున సుమారు 2.30 గంటలకు ముగ్గురు వ్యక్తులు మియాపూర్‌ క్రాస్‌రోడ్డులోని కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ ఏటీఎం కేంద్రంలోకి ప్రవేశించారు. ఇనుప రాడ్లు, రాళ్లతో ఏటీఎం యంత్రాన్ని పగలగొట్టేందుకు ప్రయత్నించారు. దాదాపు ఉదయం 5.40 గంటల వరకు యంత్రాన్ని తెరిచేందుకు యత్నించినప్పటికీ నగదు ఉన్న భాగాన్ని ఛేదించలేక అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ ఘటనలో ఏటీఎం యంత్రం భారీగా దెబ్బతిన్నప్పటికీ నగదు చోరీ కాలేదు. అయితే కేంద్రంలో ఉన్న బ్యాకప్‌ బ్యాటరీలు కనిపించకుండా పోయినట్లు ఫిర్యాదుదారు మహమ్మద్‌ ఇలియాస్‌ పోలీసులకు తెలిపారు. ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన మియాపూర్‌ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.


సీసీటీవీ దృశ్యాలతో చిక్కిన నిందితులు

ఏటీఎం కేంద్రం, పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ దృశ్యాలను పరిశీలించిన పోలీసులు నిందితులను గుర్తించారు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి సంజీవ్‌ జాదవ్‌ (40), రాపాక సూర్యప్రకాశ్‌రావు (55)ను అదుపులోకి తీసుకున్నారు. వాదిత్య కార్తీక్‌ (22) పరారీలో ఉన్నాడని, అతడి కోసం గాలిస్తున్నామని తెలిపారు. నిందితుల నుంచి ఒక ఇనుప రాడ్‌ను స్వాధీనం చేసుకున్నారు. భద్రత తక్కువగా ఉన్న ఏటీఎంలను లక్ష్యంగా చేసుకొని, ఒకరు బయట కాపలా ఉండగా మిగిలిన ఇద్దరు లోపలికి వెళ్లి యంత్రాన్ని పగలగొట్టేందుకు ప్రయత్నించినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. 

కూకట్‌పల్లి డీసీపీ రితిరాజ్‌ ఐపీఎస్‌, అదనపు డీసీపీ ఎం.సుదర్శన్‌ పర్యవేక్షణలో మియాపూర్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎన్‌.జయరాం, డిటెక్టివ్‌ ఇన్‌స్పెక్టర్‌ డి.విజయ్‌నాయక్‌, ఎస్సై బి.నర్సింహారెడ్డి, క్రైమ్‌ సిబ్బంది కేసును ఛేదించారు. ఏటీఎంల వద్ద అనుమానాస్పద కదలికలు కనిపిస్తే వెంటనే స్థానిక పోలీసులకు లేదా 112కు సమాచారం ఇవ్వాలని పోలీసులు కోరారు.



Related News సంబంధిత వార్తలు

Advertisement 728 x 90 Banner Placehoder