- నెలకు ఆరు శాతం లాభం ఇస్తానంటూ పెట్టుబడులు సేకరించినట్లు ఆరోపణ
- మైహోమ్ భుజా నివాసితుల నుంచి రూ.3.45 కోట్లకుపైగా వసూలు
- కొండపల్లి గణేష్‌పై కేసు నమోదు చేసిన సైబరాబాద్ ఈవోడబ్ల్యూ
సామాన్యుడి అస్త్రం / గచ్చిబౌలి: గణేశ్ లడ్డూ వేలంలో రికార్డు ధర చెల్లించి సంపన్న వ్యాపారిగా గుర్తింపు పొందిన వ్యక్తి.. అదే పరిచయాలు, నమ్మకాన్ని పెట్టుబడుల సేకరణకు ఉపయోగించుకున్నాడా? గచ్చిబౌలిలోని మైహోమ్ భుజా అపార్ట్‌మెంట్ నివాసితుల నుంచి రూ.3.45 కోట్లకుపైగా సేకరించి మోసం చేశారన్న ఫిర్యాదుతో కొండపల్లి గణేష్‌పై సైబరాబాద్ ఆర్థిక నేరాల విభాగం పోలీసులు కేసు నమోదు చేశారు.
రికార్డు లడ్డూతో పెరిగిన గుర్తింపు
ఖమ్మం జిల్లా ఇల్లందుకు చెందిన కొండపల్లి గణేష్ గతంలో మైహోమ్ భుజాలో నివసించారు. 2024లో రూ.29 లక్షలు, 2025లో రూ.51,07,777 చెల్లించి గణేశ్ లడ్డూలను దక్కించుకోవడంతో రాష్ట్రవ్యాప్తంగా గుర్తింపు పొందారు. రియల్ ఎస్టేట్, మద్యం వ్యాపారాలు నిర్వహిస్తున్న విజయవంతమైన వ్యాపారిగా తనను పరిచయం చేసుకుని అపార్ట్‌మెంట్ నివాసితులతో సన్నిహిత సంబంధాలు ఏర్పరచుకున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.

నెలకు ఆరు శాతం ఎర
తన వ్యాపారాల్లో పెట్టుబడులు పెడితే నెలకు ఆరు శాతం రాబడి అందిస్తామని, ప్రతి మూడు నెలలకు లాభాలు చెల్లిస్తామని గణేష్, అతడి సహచరుడు బోయినపల్లి కిరణ్ నమ్మించినట్లు బాధితులు ఆరోపించారు. ఈ హామీని విశ్వసించిన సిల్వియా శ్రీనివాస్‌రెడ్డి కుటుంబం రూ.11 లక్షలు పెట్టుబడి పెట్టినట్లు సమాచారం. మరికొందరు అపార్ట్‌మెంట్ నివాసులు విడతలవారీగా భారీ మొత్తాలు చెల్లించడంతో మొత్తం పెట్టుబడులు రూ.3.45 కోట్లకుపైగా చేరినట్లు ఫిర్యాదులో వెల్లడించారు.
కార్యాలయం ఖాళీ.. ఈవోడబ్ల్యూ దర్యాప్తు
కొంతకాలం తర్వాత లాభాలతోపాటు అసలు నగదు కూడా తిరిగి చెల్లించకుండా కాలయాపన చేసినట్లు బాధితులు పేర్కొన్నారు. అనంతరం మైహోమ్ భుజాలోని నివాసం, కార్యాలయాన్ని ఖాళీ చేసి మరో ప్రాంతానికి వెళ్లిపోయారని, తమకు అందుబాటులో లేకుండా పోయారని ఆరోపించారు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన ఈవోడబ్ల్యూ అధికారులు పెట్టుబడుల సేకరణ, బ్యాంకు లావాదేవీలు, నగదు మళ్లింపు అంశాలను పరిశీలిస్తున్నారు. కేసు ప్రస్తుతం దర్యాప్తు దశలో ఉండగా, ఆరోపణలపై గణేష్ వివరణ వెలువడాల్సి ఉంది.