Crime

బడి గదిలోనే పాముకాటు.. చిన్నారి ప్రాణానికి భద్రత ఎవరిది?

బడి గదిలోనే పాముకాటు.. చిన్నారి ప్రాణానికి భద్రత ఎవరిది?
  • ఎక్లాస్‌పూర్ ప్రభుత్వ పాఠశాలలో మూడో తరగతి విద్యార్థి రంజిత్‌కు పాముకాటు
  • నారాయణపేట జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఎనిమిదేళ్ల చిన్నారి మృతి
  • పాఠశాల గేటు వద్ద తల్లిదండ్రుల ఆందోళన.. భద్రతా లోపాలపై ఆగ్రహం

సామాన్యుడి అస్త్రం / నారాయణపేట: చదువుకునేందుకు వెళ్లిన ఎనిమిదేళ్ల చిన్నారి పాఠశాల నుంచి ప్రాణాలతో తిరిగి రాలేదు. తరగతి గదిలో పాముకాటుకు గురైన మూడో తరగతి విద్యార్థి రంజిత్ చికిత్స పొందుతూ మృతి చెందడం నారాయణపేట జిల్లాలో తీవ్ర విషాదాన్ని నింపింది. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల భద్రతపై ఈ ఘటన మరోసారి తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తింది.  ఎక్లాస్‌పూర్ గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత ప్రాథమిక పాఠశాలలో గురువారం మధ్యాహ్నం ఈ ఘటన చోటుచేసుకుంది. తరగతి గదిలో సుమారు 15 మంది విద్యార్థులు ఉండగా, మధ్యాహ్నం 3 గంటల సమయంలో రంజిత్ పాముకాటుకు గురైనట్లు సమాచారం. అప్రమత్తమైన పాఠశాల సిబ్బంది బాలుడిని నారాయణపేట జిల్లా ఆసుపత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందించినప్పటికీ రంజిత్ ప్రాణాలు దక్కలేదు.  గుండప్ప, సంగీత దంపతుల రెండో కుమారుడైన రంజిత్ మృతితో కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. అతడి తోబుట్టువులు కూడా అదే పాఠశాలలో చదువుతున్నట్లు తెలిసింది.

అయితే పాము ఎక్కడ కాటేసిందనే అంశంపై భిన్నమైన వాదనలు వినిపిస్తున్నాయి. తరగతి గది కిటికీ బయటకు రంజిత్ చేయి పెట్టినప్పుడు పాము కాటేసిందని అధికారులు చెబుతుండగా, గదిలోనే పాము కాటేసిందని స్థానికులు వాదిస్తున్నారు. పాఠశాల సమీపంలో గుట్ట ఉండటం, ప్రాంగణంలో పిచ్చిమొక్కలు పెరిగిపోవడం ప్రమాదానికి కారణమై ఉండవచ్చని గ్రామస్థులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.విషయం తెలుసుకున్న గ్రామస్థులు పాఠశాలకు చేరుకుని పామును చంపినట్లు సమాచారం. అనంతరం విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాల గేటు వద్ద ఆందోళనకు దిగారు. ప్రాంగణ పరిశుభ్రత, తరగతి గదుల తనిఖీ, అత్యవసర వైద్య సహాయంపై నిర్లక్ష్యం ఎందుకని ప్రశ్నించారు. ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యతను నిర్ధారించడంతోపాటు రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో భద్రతా తనిఖీలు చేపట్టాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. విద్యాశాఖ నుంచి అధికారిక నివేదిక వెలువడాల్సి ఉంది.

Related News సంబంధిత వార్తలు

Advertisement 728 x 90 Banner Placehoder