సామాన్యుడి అస్త్రం / మియాపూర్: రోడ్డు దాటేందుకు చేసే చిన్న తొందర జీవితాన్నే ప్రమాదంలోకి నెట్టవచ్చు. జీబ్రా క్రాసింగ్ వద్ద కొన్ని క్షణాలు వేచి ఉండటం కుటుంబానికి తీరని వేదనను తప్పించవచ్చు. ఇదే విషయాన్ని సైబరాబాద్ ట్రాఫిక్–2 డీసీపీ శేషాద్రిణి రెడ్డి ఐపీఎస్ మియాపూర్ జంక్షన్‌లో పాదచారులకు స్వయంగా వివరించారు. మియాపూర్ ట్రాఫిక్ డివిజన్ ఏసీపీతో కలిసి బుధవారం జంక్షన్‌ను సందర్శించిన డీసీపీ, పాదచారుల కదలికలు, ట్రాఫిక్ నిర్వహణను పరిశీలించారు. జీబ్రా క్రాసింగ్, పాదచారుల సిగ్నల్‌ను ఉపయోగించి, ట్రాఫిక్ పోలీసుల సూచనల మేరకే రోడ్డు దాటాలని ప్రజలకు అవగాహన కల్పించారు. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించడం వల్ల ప్రమాదాలు, ప్రాణనష్టం, కుటుంబాలకు కోలుకోలేని విషాదం మిగిలే అవకాశం ఉందని వివరించారు. నిబంధనలు పోలీసులకు భయపడి పాటించేవి కాదని, ప్రతి ఒక్కరూ సురక్షితంగా ఇంటికి చేరేందుకు ఏర్పాటు చేసిన రక్షణ కవచాలని పేర్కొన్నారు.

అనంతరం మియాపూర్ జంక్షన్‌లో కొనసాగుతున్న ఫ్లైఓవర్ నిర్మాణానికి సంబంధించిన ప్రాథమిక పనులను డీసీపీ పరిశీలించారు. ట్రాఫిక్ నిర్వహణలో భాగంగా కొత్తగా ప్రవేశపెట్టిన అదనపు లేన్ ట్రయల్ రన్‌ను సమీక్షించారు. అభివృద్ధి పనులకు ఆటంకం కలగకుండా, ప్రజలు–వాహనదారులకు సాధ్యమైనంత తక్కువ అసౌకర్యం కలిగేలా ట్రాఫిక్‌ను నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ఆల్విన్ జంక్షన్‌లోని ఫ్రీ లెఫ్ట్ మార్గాన్ని కూడా పరిశీలించారు. వాహనదారులకు స్పష్టంగా కనిపించేలా ‘ఫ్రీ లెఫ్ట్ ఎహెడ్’, ‘ఫ్రీ లెఫ్ట్‌ను అడ్డుకుంటే జరిమానా’ సూచిక బోర్డులను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఫ్రీ లెఫ్ట్ మార్గాలను అడ్డుకునే వాహనదారులపై మోటారు వాహనాల చట్టం కింద కేసులు నమోదు చేయాలని స్పష్టం చేశారు. మార్గాన్ని అడ్డుకున్న వాహనాన్ని నేరుగా వెళ్లనివ్వకుండా ఫ్రీ లెఫ్ట్ ద్వారా పంపించి, తదుపరి యూ–టర్న్ వరకు వెళ్లేలా చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. రోడ్డు భద్రత, క్రమశిక్షణ, ప్రజల సౌకర్యమే ట్రాఫిక్ నిర్వహణకు ప్రధాన లక్ష్యాలని అధికారులు పేర్కొన్నారు.
