ASTHRAM DAILY
Hyderabad

ఒకే అధికారికి నగరాభివృద్ధి పగ్గాలు!

  •  సర్ఫరాజ్‌ అహ్మద్‌కు పురపాలకశాఖ కార్యదర్శిగా అదనపు బాధ్యతలు
  • మూడు కార్పొరేషన్ల ప్రత్యేక అధికారిగానూ నియామకం
  • ఇప్పటికే హెచ్‌ఎండీఏ కమిషనర్‌, మెట్రో రైలు సంస్థ ఎండీగా విధులు

సామాన్యుడి అస్త్రం / హైదరాబాద్‌ బ్యూరో : ఒకవైపు నగరాభివృద్ధి ప్రణాళికలు.. మరోవైపు మెట్రో విస్తరణ పనులు.. వీటికి తోడు పురపాలకశాఖ పరిపాలన, మూడు కార్పొరేషన్ల బాధ్యతలు. హైదరాబాద్‌ అభివృద్ధితో ముడిపడిన పలు కీలక విభాగాల పగ్గాలు ఇప్పుడు ఒకే అధికారి చేతికి వచ్చాయి. ఇప్పటికే హెచ్‌ఎండీఏ కమిషనర్‌గా, హైదరాబాద్‌ మెట్రో రైలు సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌గా పనిచేస్తున్న సర్ఫరాజ్‌ అహ్మద్‌కు రాష్ట్ర ప్రభుత్వం మరిన్ని బాధ్యతలు అప్పగించింది.

పురపాలకశాఖ కార్యదర్శిగా, మూడు మున్సిపల్‌ కార్పొరేషన్ల ప్రత్యేక అధికారిగా ఆయనకు బాధ్యతలు అప్పగిస్తూ అక్టోబర్‌ 28న ఉత్తర్వులు జారీ చేసినట్లు సమాచారం. పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన జయేశ్‌రంజన్‌ బదిలీ నేపథ్యంలో ఈ మార్పు జరిగింది. 2009 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారి సర్ఫరాజ్‌ అహ్మద్‌ ఇకపై తన ప్రస్తుత విధులతో పాటు అదనపు బాధ్యతలనూ నిర్వహించనున్నారు.

రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది ఫిబ్రవరి 11న నగరంలో మూడు కార్పొరేషన్లను ఏర్పాటు చేసి, వాటికి జయేశ్‌రంజన్‌ను ప్రత్యేక అధికారిగా నియమించింది. అప్పటి నుంచి వాటికి సంబంధించిన అభివృద్ధి, నిర్మాణ పనుల ప్రతిపాదనలను ఆయన పరిశీలించి ఆమోదిస్తూ వచ్చారు. ఇప్పుడు ఆ బాధ్యతలు కూడా సర్ఫరాజ్‌కు బదిలీ అయ్యాయి. దీంతో నగర పురపాలనకు సంబంధించిన నిర్ణయాల్లో ఆయన పాత్ర మరింత పెరగనుంది.

హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలో సుమారు రూ.30 వేల కోట్ల అభివృద్ధి పనులు జరుగుతున్న నేపథ్యంలో ఇప్పటికే ఆ సంస్థ కమిషనర్‌ బాధ్యతలు కీలకంగా ఉన్నాయి. నగరం చుట్టూ విస్తరిస్తున్న ప్రాంతాల అభివృద్ధి, వివిధ సంస్థల మధ్య సమన్వయం వంటి అంశాలను పర్యవేక్షించాల్సి ఉంటుంది. దీనికి తోడు మెట్రో రైలు విస్తరణకు అవసరమైన భూసేకరణ, మెట్రో రైలు సంస్థను ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియను ముందుకు తీసుకెళ్లడం వంటి అంశాలు కూడా ఆయన పరిధిలోనే ఉన్నాయి.


ఈ పరిస్థితుల్లో పురపాలకశాఖ కార్యదర్శి బాధ్యతలు, మూడు కార్పొరేషన్ల ప్రత్యేక అధికారి విధులు అదనంగా చేరడం చర్చనీయాంశమవుతోంది. ఒకే అధికారి పరిధిలో కీలక విభాగాలు ఉండటం వల్ల సమన్వయం మెరుగుపడే అవకాశం ఉన్నప్పటికీ, విస్తృతమైన పనిభారాన్ని ఎలా నిర్వహిస్తారన్నది ప్రధాన అంశం. ప్రతిపాదనల పరిశీలన నుంచి పనుల పురోగతి వరకు ప్రతి దశలోనూ సమయం కేటాయించాల్సి ఉంటుంది.

ప్రజలకు మాత్రం తమ ప్రాంతంలో అభివృద్ధి పనులు ముందుకు కదలడం, సమస్యలపై సకాలంలో నిర్ణయాలు రావడమే ముఖ్యం. అదనపు బాధ్యతలతో పరిపాలనలో వేగం పెరుగుతుందా? పెండింగ్‌ పనులకు పరిష్కారం లభిస్తుందా? అన్నది రాబోయే రోజుల్లో తేలనుంది.
Journalist
Jairam
Journalist

Related News సంబంధిత వార్తలు

Advertisement 728 x 90 Banner Placehoder