ASTHRAM DAILY
Hyderabad

పార్కుల్లో పిచ్చిమొక్కలు.. ఇళ్లలోకి పాములు!

కేపీహెచ్‌బీ నాలుగో ఫేజ్‌లో పార్కుల దుస్థితిపై జనసేన వినతి

- చెత్తాచెదారం, పిచ్చిమొక్కలతో పార్కులు అధ్వానంగా మారాయని ఫిర్యాదు
- పగటిపూటా పాములు వస్తున్నాయని.. చిన్నారుల భద్రతపై ఆందోళన
- జోనల్‌ కమిషనర్‌ మయాంక్‌ సింగ్‌కు సమస్యలను వివరించిన నాయకులు

సామాన్యుడి అస్త్రం / కూకట్‌పల్లి: పిల్లలు ఆడుకోవడానికి, పెద్దలు కాసేపు నడవడానికి ఉపయోగపడాల్సిన పార్కులు.. ఇప్పుడు వాటి పక్కన నివసించే వారికే భయం కలిగిస్తున్నాయని జనసేన నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. కేపీహెచ్‌బీ నాలుగో ఫేజ్‌లోని పార్కులు నిర్వహణకు నోచుకోక పిచ్చిమొక్కలు, చెత్తాచెదారంతో నిండిపోయాయని కూకట్‌పల్లి జోనల్‌ కమిషనర్‌ మయాంక్‌ సింగ్‌కు వినతిపత్రం అందజేశారు. కాలనీవాసుల భద్రత, ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు.

పార్కుల్లో పిచ్చిమొక్కలు పెరిగిపోవడంతో పాముల బెడద తీవ్రమైందని నాయకులు కమిషనర్‌ దృష్టికి తీసుకెళ్లారు. రాత్రివేళల్లోనే కాకుండా పగటిపూట కూడా పాములు సంచరిస్తూ చుట్టుపక్కల ఇళ్లలోకి వస్తున్నాయని కాలనీవాసులు తమకు తెలిపినట్లు వివరించారు. ఈ పరిస్థితితో స్థానికులు, ముఖ్యంగా చిన్నారుల తల్లిదండ్రులు భయాందోళనకు గురవుతున్నారని పేర్కొన్నారు.

మరోవైపు చెత్తాచెదారం పేరుకుపోవడంతో పార్కుల్లో పారిశుద్ధ్యం దెబ్బతిన్నదని తెలిపారు. సరైన పర్యవేక్షణ లేకపోవడంతో కొన్ని పార్కులు మద్యం సేవించేవారికి అడ్డాలుగా మారాయని ఫిర్యాదు చేశారు. ప్రజలకు ఆహ్లాదాన్ని పంచాల్సిన ప్రదేశాలు ఇలా నిరుపయోగంగా మారడం పట్ల స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని చెప్పారు.


పార్కుల్లో పిచ్చిమొక్కలు తొలగించి, చెత్తను శుభ్రం చేయడంతోపాటు క్రమం తప్పకుండా నిర్వహణ చేపట్టాలని నాయకులు కోరారు. కాలనీవాసులు నిర్భయంగా పార్కులను ఉపయోగించుకునేలా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

వినతిని స్వీకరించిన జోనల్‌ కమిషనర్‌ మయాంక్‌ సింగ్‌ సానుకూలంగా స్పందించినట్లు జనసేన నాయకులు తెలిపారు. సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో జనసేన నాయకులు కొల్లా శంకర్‌, ఆళ్ల నరేంద్ర, పోలేబోయిన శ్రీనివాస్‌ గోవిందా, పి.గోపి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
Journalist
Jairam
Journalist

Related News సంబంధిత వార్తలు

Advertisement 728 x 90 Banner Placehoder