- కాలేజీకి పాజిటివ్ రిపోర్టు ఇచ్చేందుకు ‘రేటు’ ఫిక్స్?
- ఇప్పటికే రూ.30 వేలు తీసుకున్నట్లు బాధితుడి ఫిర్యాదు
- మిగతా రూ.20 వేలు స్వీకరిస్తుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టివేత
- జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి కార్యాలయంలో ఏసీబీ తనిఖీలు
సామాన్యుడి అస్త్రం / సంగారెడ్డి : ప్రైవేట్ కళాశాలకు అనుకూలంగా తనిఖీ నివేదిక ఇచ్చేందుకు రూ.50 వేల లంచం డిమాండ్ చేశారనే ఆరోపణలపై సంగారెడ్డి జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి గోవింద్‌రామ్‌ను ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలోని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి కార్యాలయంలో ఈ ఘటన చోటుచేసుకోవడం విద్యాశాఖ వర్గాల్లో కలకలం రేపింది.
ఏసీబీ అధికారుల సమాచారం ప్రకారం.. సంగారెడ్డి జిల్లాలోని ఓ ప్రైవేట్ కళాశాలను తనిఖీ చేసి, అనుకూల నివేదిక ఇచ్చేందుకు అధికారి గోవింద్‌రామ్ రూ.50 వేలు డిమాండ్ చేసినట్లు బాధితుడు ఫిర్యాదు చేశారు. ఇందులో గత వారమే రూ.30 వేలు తీసుకున్నారని, మిగిలిన రూ.20 వేల కోసం పదేపదే ఫోన్ చేసి ఒత్తిడి తెచ్చారని బాధితుడు ఆరోపించారు.
అధికారి నుంచి ఒత్తిడి పెరగడంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ఫిర్యాదును పరిశీలించిన అధికారులు పక్కా ప్రణాళికతో వల పన్నారు. జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి కార్యాలయంలో బాధితుడి నుంచి రూ.20 వేలు స్వీకరిస్తున్న సమయంలో గోవింద్‌రామ్‌ను ఏసీబీ డీఎస్పీ సుదర్శన్‌రెడ్డి నేతృత్వంలోని బృందం పట్టుకున్నట్లు వెల్లడించారు.
అనంతరం కార్యాలయంలో ఏసీబీ అధికారులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. సంబంధిత దస్త్రాలు, కాలేజీ తనిఖీ నివేదికలు, ఇతర రికార్డులను పరిశీలించినట్లు సమాచారం. లంచం డిమాండ్, నగదు స్వీకరణ వ్యవహారంపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. విచారణలో మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశముందని అధికారులు పేర్కొన్నారు.