- నాలుగో అంతస్తు నుంచి జారిపడి విజయ్‌బాబు మృతి
- మియాపూర్ జనప్రియ అపార్ట్‌మెంట్స్ ఫేజ్–5లో విషాదం
- మొదటి అంతస్తులో ఉన్న లిఫ్ట్‌పై పడిన 24 ఏళ్ల యువకుడు
- కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు
సామాన్యుడి అస్త్రం / మియాపూర్ : లిఫ్ట్ వస్తుందని ఎదురుచూసిన ఆ యువకుడు డోర్ తెరిచి ముందుకు అడుగు వేశాడు. కానీ అక్కడ లిఫ్ట్ లేదు.. క్షణాల్లోనే నాలుగో అంతస్తు నుంచి గుంతలో పడిపోయాడు. తీవ్ర గాయాలతో ఆసుపత్రికి తరలించేలోపే ప్రాణాలు కోల్పోయాడు. మియాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న ఈ విషాద ఘటన స్థానికులను కలచివేసింది.
పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మియాపూర్‌లోని జనప్రియ అపార్ట్‌మెంట్స్ ఫేజ్–5, బ్లాక్ బీ–3లో వెంకటేష్ తన భార్య, ఇద్దరు కుమారులతో కలిసి నాలుగో అంతస్తులో నివసిస్తున్నారు. ఆయన కుమారుడు విజయ్‌బాబు (24)కు వినికిడి, చూపునకు సంబంధించిన ఇబ్బందులతోపాటు మానసిక ఆరోగ్య సమస్యలు ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
మంగళవారం మధ్యాహ్నం విజయ్‌బాబు నాలుగో అంతస్తులోని లిఫ్ట్ వద్దకు వెళ్లి డోర్‌ను తెరిచాడు. ఆ సమయంలో లిఫ్ట్ మొదటి అంతస్తులో ఉన్న విషయాన్ని గుర్తించకుండా ముందుకు కాలు వేయడంతో ఒక్కసారిగా గుంతలోకి జారిపోయాడు. నాలుగో అంతస్తు నుంచి పడిన అతడు మొదటి అంతస్తులో నిలిచి ఉన్న లిఫ్ట్ పైభాగంపై పడిపోయాడు.
ఈ ప్రమాదంలో విజయ్‌బాబు తలతోపాటు శరీరంలోని పలు భాగాలకు తీవ్ర గాయాలయ్యాయి. పెద్ద శబ్దం రావడంతో అప్రమత్తమైన కుటుంబ సభ్యులు, అపార్ట్‌మెంట్‌వాసులు వెంటనే అతడిని బయటకు తీసి సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే విజయ్‌బాబు మృతి చెందినట్లు నిర్ధారించారు.
సమాచారం అందుకున్న మియాపూర్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. నాలుగో అంతస్తులో లిఫ్ట్ లేకున్నా డోర్ ఎలా తెరుచుకుందనే అంశంతోపాటు లిఫ్ట్ భద్రతా వ్యవస్థ, నిర్వహణ పరిస్థితులపై వివరాలు సేకరిస్తున్నట్లు సమాచారం. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
యువకుడి ఆకస్మిక మరణంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. అపార్ట్‌మెంట్‌లో విషాదఛాయలు అలుముకున్నాయి.