Telangana

చదువు చెప్పాల్సిన చేతులతో చిన్నారిపై పిడిగుద్దులు!

చదువు చెప్పాల్సిన చేతులతో చిన్నారిపై పిడిగుద్దులు!
బోథ్‌ ప్రైవేట్‌ పాఠశాలలో ఉపాధ్యాయురాలి దాష్టీకం
నర్సరీ విద్యార్థిని చెవి మెలితిప్పి చెంపలు, వీపుపై దాడి
చిన్నారి శరీరంపై గాయాలు చూసి సీసీటీవీ పరిశీలించిన తల్లిదండ్రులు
బాధిత కుటుంబం ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు
సామాన్యుడి అస్త్రం / బోథ్‌ : విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయురాలే అభం శుభం తెలియని నర్సరీ చిన్నారిపై విచక్షణారహితంగా దాడి చేసిన ఘటన ఆదిలాబాద్‌ జిల్లా బోథ్‌లో ఆలస్యంగా వెలుగుచూసింది. స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్‌ పాఠశాలలో చదువుతున్న చిన్నారి పట్ల ఉపాధ్యాయురాలు వ్యవహరించిన తీరు తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది.
తరగతి గదిలో చిన్నారి చెవి మెలితిప్పిన ఉపాధ్యాయురాలు.. చెంపలు, వీపుపై పిడిగుద్దులు కురిపించినట్లు ఆరోపణలు వచ్చాయి. పాఠశాల నుంచి ఇంటికి వచ్చిన చిన్నారి శరీరంపై గాయాలను గుర్తించిన తల్లిదండ్రులు ఏం జరిగిందని ఆరా తీశారు. అనంతరం పాఠశాలలోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలించగా ఉపాధ్యాయురాలి దాడికి సంబంధించిన దృశ్యాలు బయటపడినట్లు తెలిసింది.
చిన్నారిపై ఉపాధ్యాయురాలు ప్రవర్తించిన తీరును చూసి తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. పిల్లలను విద్యావంతులుగా తీర్చిదిద్దుతారని నమ్మి పాఠశాలకు పంపిస్తే.. ఇలా భయభ్రాంతులకు గురిచేస్తారా అంటూ ప్రశ్నించారు. చిన్నారిపై దాడికి పాల్పడిన ఉపాధ్యాయురాలితోపాటు ఘటనపై నిర్లక్ష్యంగా వ్యవహరించిన పాఠశాల యాజమాన్యంపైనా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.
బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సీసీటీవీ ఫుటేజీతోపాటు అందుబాటులో ఉన్న ఇతర ఆధారాలను పరిశీలిస్తున్నట్లు సమాచారం. పూర్తి విచారణ అనంతరం తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉంది.
చిన్నారులపై శారీరక దండనకు తావులేదని నిబంధనలు చెబుతున్నా.. ప్రైవేట్‌ పాఠశాలల్లో ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడం విద్యాశాఖ పర్యవేక్షణపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. ఈ ఘటనపై సంబంధిత విద్యాశాఖ అధికారులు స్పందించి సమగ్ర విచారణ చేపట్టాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.

Related News సంబంధిత వార్తలు

Advertisement 728 x 90 Banner Placehoder