Telangana

ఇల్లు ఆలస్యం.. వడ్డీతో వసూలు! వాసవి అర్బన్‌కు రెరా షాక్‌

ఇల్లు ఆలస్యం.. వడ్డీతో వసూలు! వాసవి అర్బన్‌కు రెరా షాక్‌
  • ఆలస్యమైన ఫ్లాట్లకు 10.70 శాతం వార్షిక వడ్డీ
  • బకాయిలను 60 రోజుల్లో చెల్లించాలని టీజీ రెరా ఆదేశం
  • అనుమతించిన ప్లాన్‌ ప్రకారమే లిఫ్టులు నిర్మించాలని స్పష్టీకరణ
సామాన్యుడి అస్త్రం / బాచుపల్లి : సొంతింటి కోసం లక్షల రూపాయలు చెల్లించి, ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న బాచుపల్లి వాసవి ఎస్‌ అర్బన్‌ కొనుగోలుదారులకు ఊరట కలిగించే తీర్పు వెలువడింది. ఫ్లాట్ల అప్పగింతలో జరిగిన ఆలస్యానికి బాధిత కొనుగోలుదారులకు సంవత్సరానికి 10.70 శాతం వడ్డీ చెల్లించాలని తెలంగాణ రియల్‌ ఎస్టేట్‌ రెగ్యులేటరీ అథారిటీ ఆదేశించింది.
వాసవి ఎస్‌ అర్బన్‌లో ఫ్లాట్లు కొనుగోలు చేసిన రఘునాథ్‌ బిశ్వాల్‌, వెంకటరమణ పుతి టీజీ రెరాను ఆశ్రయించారు. ఒకరు రూ.44.85 లక్షల విలువైన ఫ్లాట్‌కు రూ.40.77 లక్షలు చెల్లించగా, మరొకరు రూ.39 లక్షల ఫ్లాట్‌ను కొనుగోలు చేసినట్లు ఫిర్యాదుల్లో పేర్కొన్నారు. ఒప్పందం ప్రకారం ఫ్లాట్లు అప్పగించకపోవడంతోపాటు, హామీ ఇచ్చిన లిఫ్టుల సంఖ్యను తగ్గించారని ఆరోపించారు.
కోవిడ్‌, కార్మికుల కొరత, నిర్మాణ సామగ్రి ధరలు, ఇతర బ్లాకులకు సంబంధించిన న్యాయ వివాదాల కారణంగా ఆలస్యం జరిగిందన్న డెవలపర్‌ వాదనను రెరా తిరస్కరించింది. ఇతర బ్లాకుల వివాదాలను చూపించి కొనుగోలుదారులకు ఫ్లాట్లు అప్పగించకుండా ఉండలేరని స్పష్టం చేసింది.
బాధిత కొనుగోలుదారులకు 2025 జూన్‌ 26 నుంచి చట్టబద్ధంగా ఫ్లాట్ల స్వాధీనం అప్పగించే వరకు 10.70 శాతం వార్షిక వడ్డీ చెల్లించాలని ఆదేశించింది. ఇప్పటివరకు పేరుకుపోయిన వడ్డీ బకాయిలను 60 రోజుల్లో చెల్లించడంతోపాటు, ఆ తర్వాత ప్రతి నెలా పదో తేదీలోగా వడ్డీ చెల్లించాలని పేర్కొంది.
ఒప్పందంలో పేర్కొనని రూ.30 వేల డెబ్రిస్‌ చార్జీకి ఆధారం లేదని తేల్చింది. మంజూరైన నిర్మాణ ప్రణాళిక ప్రకారమే లిఫ్టులు ఏర్పాటు చేయాలని ఆదేశించింది. నిర్ణయాన్ని అమలు చేయకపోతే రెరా చట్టంలోని సెక్షన్‌ 63 ప్రకారం జరిమానా చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది.

Related News సంబంధిత వార్తలు

Advertisement 728 x 90 Banner Placehoder