ఫ్లాగ్ డే వారోత్సవాల్లో వ్యాసరచన పోటీలు
- తెలుగు, ఆంగ్ల విభాగాల్లో 12 మంది విజేతల ఎంపిక
- రెండు కేటగిరీల్లో ప్రతిభ చూపిన పోలీసు సిబ్బంది
- విజేతలను అభినందించిన సైబరాబాద్ సీపీ డాక్టర్ ఎం. రమేష్
సామాన్యుడి అస్త్రం / సైబరాబాద్ క్రైమ్ బ్యూరో : నిత్యం శాంతిభద్రతల పరిరక్షణలో బిజీగా ఉండే పోలీసులు ఈసారి కలంతో తమ ప్రతిభను చాటుకున్నారు. పోలీస్ ఫ్లాగ్ డే వారోత్సవాల్లో భాగంగా సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో సిబ్బంది తమ రచనా నైపుణ్యాలను ప్రదర్శించారు. తెలుగు, ఆంగ్ల భాషల్లో నిర్వహించిన పోటీల్లో మొత్తం 12 మంది విజేతలుగా నిలిచారు. వీరిని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డాక్టర్ ఎం. రమేష్ ఐపీఎస్ అభినందించారు.
తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ ఆదేశాల మేరకు అక్టోబర్ 21న పోలీస్ ఫ్లాగ్ డే సందర్భంగా ఈ నెల 21 నుంచి 31 వరకు వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా పోలీసు సిబ్బందిలో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీయడంతో పాటు రచనా నైపుణ్యాలు, ఆలోచనా శక్తిని ప్రోత్సహించేందుకు వ్యాసరచన పోటీలు ఏర్పాటు చేశారు. సిబ్బంది హోదాలను బట్టి రెండు కేటగిరీలుగా పోటీలు నిర్వహించారు.
తెలుగు విభాగంలో విజేతలు వీరే..
ఏఆర్‌ఎస్‌ఐలు, ఏఎస్‌ఐలు, హెడ్ కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లకు నిర్వహించిన మొదటి కేటగిరీలో కె. రమేష్ ప్రథమ, పి. జ్యోతి ద్వితీయ, జి. రాజమణి తృతీయ బహుమతులకు ఎంపికయ్యారు. ఆర్‌ఎస్‌ఐలు, ఎస్‌ఐలు, అంతకంటే పైస్థాయి అధికారుల రెండో కేటగిరీలో బి. వెంకటరమణ మొదటి, జె. ఉపేందర్ రెండో, జి. శశిధర్ మూడో స్థానాల్లో నిలిచారు.
ఆంగ్ల విభాగంలోనూ ప్రతిభ..
ఆంగ్ల వ్యాసరచన పోటీల మొదటి కేటగిరీలో జి. రూప ప్రథమ, ఈ. సునీత ద్వితీయ, ఎం. దివ్య తృతీయ బహుమతులు సాధించారు. రెండో కేటగిరీలో ఎన్. రోహిణి మొదటి, ఎస్. రఘు రెండో, వి. యతీష్ చంద్ర మూడో స్థానాలను దక్కించుకున్నారు.
ఈ సందర్భంగా సీపీ డాక్టర్ ఎం. రమేష్ మాట్లాడుతూ పోలీసు సిబ్బందిలోని ప్రతిభను గుర్తించి ప్రోత్సహించేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయని పేర్కొన్నారు. విధి నిర్వహణతో పాటు సృజనాత్మకత, రచనా నైపుణ్యాలను పెంపొందించుకోవడం వృత్తిపరమైన అభివృద్ధికి దోహదపడుతుందన్నారు. పోటీల్లో విజేతలుగా నిలిచిన సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు.