- నేటి నుంచి ప్రత్యామ్నాయ మార్గాల్లోనే వెళ్లాలి
- డీఎల్ఎఫ్ గేట్–1 నుంచి గచ్చిబౌలి ట్రాఫిక్ ఠాణా వరకు మూసివేత
- ఐఐఐటీ జంక్షన్లో ఫ్లైఓవర్, అండర్‌పాస్ పనుల నేపథ్యంలో నిర్ణయం
- టీసీఎస్ నాన్ సెజ్ గేటు ద్వారా రాకపోకలకు అనుమతి
సామాన్యుడి అస్త్రం / గచ్చిబౌలి : రోజూ వెళ్లే దారే కదా అని డీఎల్ఎఫ్ వైపు వాహనం మళ్లిస్తే వెనక్కి తిరగాల్సి రావచ్చు. ఐఐఐటీ జంక్షన్లో బహుళస్థాయి ఫ్లైఓవర్, అండర్‌పాస్ నిర్మాణ పనుల నేపథ్యంలో డీఎల్ఎఫ్ గేట్ నంబరు–1 నుంచి గచ్చిబౌలి ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్ వరకు రహదారి మూసివేతను మరో 90 రోజులు పొడిగించారు. అక్టోబరు 27, 2026 నుంచి ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ప్రకటించారు. రాడిసన్ హోటల్ జంక్షన్ నుంచి డీఎల్ఎఫ్ మీదుగా ఐఐఐటీ జంక్షన్‌కు వెళ్లే వాహనాలను గేట్ నంబరు–1 వరకే అనుమతిస్తారు. ఆ తర్వాత ముందుకు వెళ్లేందుకు అవకాశం ఉండదు. ఐఐఐటీ వైపు వెళ్లేవారు గచ్చిబౌలి జంక్షన్ మీదుగా ఇందిరానగర్ వైపు కుడి మలుపు తీసుకుని గమ్యానికి చేరుకోవాలి.

లింగంపల్లి నుంచి డీఎల్ఎఫ్ రోడ్డుకు వచ్చే వాహనాలను గచ్చిబౌలి ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్ వద్ద మళ్లిస్తారు. అక్కడి నుంచి ఐఐఐటీ జంక్షన్, గచ్చిబౌలి జంక్షన్ మీదుగా రాడిసన్ జంక్షన్‌కు చేరుకుని, ఎడమవైపు తిరిగి డీఎల్ఎఫ్కు వెళ్లాలి. టీసీఎస్ ఉద్యోగులు మాత్రం నాన్ సెజ్ (సీఎంసీ) గేటు ద్వారా యథావిధిగా రాకపోకలు సాగించవచ్చు.
పనుల పురోగతి, రహదారిపై అందుబాటులో ఉండే స్థలాన్ని బట్టి దశలవారీగా రాకపోకలు పునరుద్ధరించే అవకాశం ఉందని ప్రకటన పేర్కొంది. అయితే 90 రోజుల్లో నిర్మాణమంతా పూర్తవుతుందని భావించకూడదు. పనులు కనీసం ఏడాదిపాటు కొనసాగే అవకాశం ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ముఖ్యంగా కార్యాలయాలకు వెళ్లే ఉద్యోగులు ప్రయాణాన్ని ముందుగా ప్రణాళిక చేసుకుని, ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని సూచించారు.
