ASTHRAM DAILY
Telangana

అయ్యప్ప సొసైటీలో బోర్ల జోరు.. స్పందన ఏది?

  • అనుమతులు లేకుండా తవ్వుతున్నారని మల్లారెడ్డి ఆరోపణ
  • ఫొటోలు, లొకేషన్‌ పంపినా చర్యలు లేవని విమర్శ
  • తక్షణ తనిఖీలు చేసి బోరు వాహనాలను సీజ్‌ చేయాలని డిమాండ్‌

సామాన్యుడి అస్త్రం / శేరిలింగంపల్లి : అయ్యప్ప సొసైటీలో అనుమతులు లేకుండా బోర్లు వేస్తున్నారని, ఫిర్యాదు చేసినా రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదని మిద్దెల మల్లారెడ్డి ఆరోపించారు. భూగర్భ జలాల పరిరక్షణకు చర్యలు తీసుకోవాల్సిన యంత్రాంగం స్పందించకపోవడం బాధాకరమన్నారు. సంబంధిత ప్రదేశాల్లో వెంటనే తనిఖీలు నిర్వహించి, అనుమతులు లేకపోతే బోరు వాహనాలను సీజ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు.

అయ్యప్ప సొసైటీ ప్రధాన రహదారైన 100 ఫీట్‌ రోడ్డులోని బేల్‌ (BAEL) హోటల్‌ పక్కనున్న స్థలంతో పాటు ప్లాట్‌ నంబరు 687లో పట్టపగలే బోర్లు తవ్వుతున్నట్లు ఆయన ఓ ప్రకటనలో పేర్కొన్నారు. రెండు బోరు వాహనాలతో అధిక లోతులో తవ్వకాలు చేస్తున్నారని తెలిపారు. వాటి ఫొటోలు తీసి, వాట్సాప్‌ ద్వారా లొకేషన్‌ కూడా పంపించినట్లు వెల్లడించారు.

ఈ విషయాన్ని తెలియజేసేందుకు శేరిలింగంపల్లి తహసీల్దార్‌ మైపాల్‌రెడ్డికి ఫోన్‌ చేసినా స్పందన రాలేదని మల్లారెడ్డి పేర్కొన్నారు. సంబంధిత ఆర్‌ఐ సాయికిరణ్‌కు ఫోన్‌ చేయగా తొలుత పరిశీలిస్తామని చెప్పారని, ఆ తర్వాత చేసిన కాల్స్‌కు సమాధానం ఇవ్వలేదని ఆరోపించారు. ప్రజల ఫిర్యాదులను స్వీకరించి చర్యలు తీసుకోవాల్సిన అధికారులు అందుబాటులో లేకపోతే సమస్యలను ఎవరికి చెప్పుకోవాలని ప్రశ్నించారు.

భూగర్భ జలాలు తగ్గుతున్న నేపథ్యంలో ఇష్టారీతిన బోర్లు తవ్వితే భవిష్యత్తులో తాగునీటి ఇబ్బందులు తీవ్రమయ్యే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు. జలవనరుల పరిరక్షణపై ప్రకటనలతో సరిపెట్టకుండా క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ పెంచాలని కోరారు. బోర్లు వేస్తున్న ప్రదేశాల్లో అనుమతులను పరిశీలించి, నిబంధనల ఉల్లంఘన ఉంటే వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు.

అయ్యప్ప సొసైటీలో ప్రత్యేక తనిఖీలు చేపట్టాలని, పర్యవేక్షణకు అధికారులను నియమించాలని మల్లారెడ్డి విజ్ఞప్తి చేశారు. తహసీల్దార్‌ వారానికి ఒకరోజు స్వయంగా క్షేత్రస్థాయిలో పర్యటించి ఫిర్యాదులను పరిశీలించాలని కోరారు. ప్రజలకు జవాబుదారీగా వ్యవహరించి, తీసుకున్న చర్యలను తెలియజేయాలన్నారు. స్పందన లేకపోతే బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహిస్తామని హెచ్చరించారు.
Journalist
Jairam
Journalist

Related News సంబంధిత వార్తలు

Advertisement 728 x 90 Banner Placehoder