ASTHRAM DAILY
Cinema

విజయ్‌–రష్మికపై తప్పుడు ప్రచారం.. పోలీసులకు ఫిర్యాదు

  •  మార్ఫింగ్‌ స్క్రీన్‌షాట్లు, నకిలీ ప్రొఫైల్స్‌పై అభ్యంతరం
  • ఆధారాలు అందజేసిన విరోష్‌ టీమ్‌ ప్రతినిధులు
  • పరిశీలించి చట్టప్రకారం చర్యలు తీసుకుంటామన్న అడిషనల్‌ డీసీపీ

సామాన్యుడి అస్త్రం / గచ్చిబౌలి : నటులు విజయ్‌ దేవరకొండ, రష్మిక మందన్నలను లక్ష్యంగా చేసుకుని సోషల్‌ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని విరోష్‌ టీమ్‌ ప్రతినిధులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. శేరిలింగంపల్లి అడిషనల్‌ డీసీపీ ఉదయ్‌రెడ్డిని కలిసి, సంబంధిత ఆధారాలను అందజేశారు. నిరాధారమైన కథనాలు, మార్ఫింగ్‌ చేసిన స్క్రీన్‌షాట్లు, నకిలీ ప్రొఫైల్స్‌తో వేధింపులకు పాల్పడుతున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.

విజయ్‌, రష్మికల గురించి ఉద్దేశపూర్వకంగా అసత్యాలను ప్రచారం చేస్తున్నారని టీమ్‌ ప్రతినిధులు పేర్కొన్నారు. సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్న పోస్టులు, స్క్రీన్‌షాట్లను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. నకిలీ ఖాతాల ద్వారా జరుగుతున్న ప్రచారంతో వారి ప్రతిష్ఠకు భంగం కలిగించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి పోస్టులు పెడుతున్న వారితో పాటు, పెయిడ్‌ క్యాంపెయిన్లు నిర్వహిస్తున్న వారిపైనా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.



భావప్రకటన స్వేచ్ఛను తాము గౌరవిస్తామని విరోష్‌ టీమ్‌ స్పష్టం చేసింది. అయితే ఆధారాలు లేని విషయాలను నిజాలుగా ప్రచారం చేయడం, మార్ఫింగ్‌ చేసిన సమాచారంతో వ్యక్తులను వేధించడం సరికాదని పేర్కొంది. ఇటువంటి నిరాధార ప్రచారాలను అడ్డుకోవాలన్న ఉద్దేశంతోనే పోలీసులను ఆశ్రయించినట్లు తెలిపింది.

ఫిర్యాదును పరిశీలించి, చట్టప్రకారం తగిన చర్యలు తీసుకుంటామని అడిషనల్‌ డీసీపీ ఉదయ్‌రెడ్డి ఈ సందర్భంగా తెలిపారు.
Journalist
Jairam
Journalist

Related News సంబంధిత వార్తలు

Advertisement 728 x 90 Banner Placehoder