Crime

ఒక్క క్లిక్‌తో ఫోన్ హ్యాక్!.. 350 మంది విద్యార్థులకు సైబర్ పాఠం –సైబర్ క్రైమ్ అవగాహన కార్యక్రమం

ఒక్క క్లిక్‌తో ఫోన్ హ్యాక్!.. 350 మంది విద్యార్థులకు సైబర్ పాఠం –సైబర్ క్రైమ్ అవగాహన కార్యక్రమం

సామాన్యుడి అస్త్రం / ఐడీఏ బొల్లారం:  చేతిలోని మొబైల్‌ విద్యార్థికి ఓ పాఠశాల.. ప్రపంచాన్ని పరిచయం చేసే కిటికీ. అదే మొబైల్‌లో చేసే ఒక్క తప్పు క్లిక్‌ వ్యక్తిగత సమాచారం, కుటుంబ ఆర్థిక భద్రతను సైబర్ నేరగాళ్ల చేతుల్లో పెట్టే ప్రమాదముంది. ఈ నేపథ్యంలో జాగృతి దివస్ సందర్భంగా ఐడీఏ బొల్లారం పోలీసులు టీజీ మోడల్ కళాశాలలో ‘సురక్షా తిరంగా సైబర్ క్రైమ్ అవగాహన కార్యక్రమం’ నిర్వహించారు. సుమారు 350 మంది విద్యార్థులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో ప్రస్తుతం పెరుగుతున్న సైబర్ నేరాలు, మోసగాళ్లు అనుసరిస్తున్న కొత్త పద్ధతులు, వాటి నుంచి రక్షణ పొందేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను పోలీసులు వివరించారు. విద్యార్థులు ఆన్‌లైన్ గేమ్స్‌కు బానిస కాకూడదని సూచించారు. అపరిచిత వ్యక్తులు పంపే APK ఫైళ్లు, అనుమానాస్పద లింకులు, QR కోడ్‌లను ఎట్టి పరిస్థితుల్లోనూ క్లిక్ లేదా స్కాన్ చేయవద్దని హెచ్చరించారు. వీటి ద్వారా మొబైల్‌లోకి హానికరమైన సాఫ్ట్‌వేర్ ప్రవేశించి, ఫోన్ నియంత్రణ సైబర్ నేరగాళ్ల చేతుల్లోకి వెళ్లే ప్రమాదముందని వివరించారు.

OTP, UPI PIN, బ్యాంకు ఖాతా వివరాలు, పాస్‌వర్డ్‌లను ఎవరితోనూ పంచుకోవద్దని స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో వ్యక్తిగత సమాచారం, ఫొటోలు, ప్రయాణ వివరాలను బహిరంగంగా ఉంచడం ప్రమాదకరమని తెలిపారు. నకిలీ ఉద్యోగాలు, స్కాలర్‌షిప్‌లు, లాటరీలు, పెట్టుబడులు, గేమింగ్ రివార్డుల పేరుతో వచ్చే ఆకర్షణీయమైన సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సైబర్ మోసానికి గురైతే భయపడకుండా, సమయం వృథా చేయకుండా వెంటనే 1930 హెల్ప్‌లైన్‌కు కాల్ చేయాలని లేదా జాతీయ సైబర్ క్రైమ్ పోర్టల్‌లో ఫిర్యాదు చేయాలని తెలిపారు. త్వరగా ఫిర్యాదు చేస్తే నగదు బదిలీని అడ్డుకునే అవకాశం పెరుగుతుందని వివరించారు. సీఐ సుధీర్‌కుమార్, ఎస్సైలు అక్షిత, కిష్టారెడ్డి విద్యార్థులకు అవగాహన కల్పించారు. కళాశాల ప్రిన్సిపాల్ శ్రీదేవి పాల్గొన్నారు. డిజిటల్ ప్రపంచాన్ని భయంతో కాకుండా బాధ్యతతో ఉపయోగించినప్పుడే సాంకేతికత విద్యార్థుల భవిష్యత్తుకు నిజమైన బలంగా మారుతుందని పోలీసులు పేర్కొన్నారు.

Related News సంబంధిత వార్తలు

Advertisement 728 x 90 Banner Placehoder