Police

ఐటీ కారిడార్‌కు ట్రాఫిక్‌ సంకెళ్లు తెంచే ప్లాన్‌!

ఐటీ కారిడార్‌కు ట్రాఫిక్‌ సంకెళ్లు తెంచే ప్లాన్‌!
  • కార్యాలయాల లోపలే క్యాబ్‌ల పికప్‌, డ్రాప్‌, పార్కింగ్‌ ఏర్పాట్లు
  • కార్‌పూలింగ్‌, భారీ బస్సులు, దశలవారీ షిఫ్ట్‌ సమయాలకు ప్రాధాన్యం
  • గేట్ల వద్ద ట్రాఫిక్‌ నియంత్రణకు కార్పొరేట్‌ సెక్యూరిటీ సిబ్బంది వినియోగం

సామాన్యుడి అస్త్రం / సైబరాబాద్ : ఐటీ కారిడార్లలో రోజురోజుకూ పెరుగుతున్న ట్రాఫిక్‌ రద్దీకి శాశ్వత పరిష్కారం చూపే దిశగా సైబరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు సమగ్ర కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేశారు. సొసైటీ ఫర్‌ సైబరాబాద్‌ సెక్యూరిటీ కౌన్సిల్‌ (ఎస్‌సీఎస్‌సీ) ఆధ్వర్యంలో పోలీసు, పౌర విభాగాలు, ఐటీ సంస్థల ప్రతినిధులతో నిర్వహించిన ఉన్నతస్థాయి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సైబరాబాద్‌ ట్రాఫిక్‌ జాయింట్‌ కమిషనర్‌ సన్‌ప్రీత్‌ సింగ్‌ ఐపీఎస్‌ నేతృత్వంలో జరిగిన సమావేశంలో ఐటీ కారిడార్‌ విస్తరణ, ఉద్యోగుల సంఖ్య పెరుగుదల, కార్యాలయాల వద్ద ఏర్పడుతున్న ట్రాఫిక్‌ సమస్యలపై విస్తృతంగా చర్చించారు. ఐటీ రంగం వృద్ధికి అనుగుణంగా రవాణా వ్యవస్థను ముందస్తు ప్రణాళికతో తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని అధికారులు స్పష్టం చేశారు.


రోడ్డుపై క్యాబ్‌ నిలిస్తే చర్యలే!

కార్యాలయాల గేట్ల వద్ద ఖాళీ క్యాబ్‌లు, ఆటోలు నిలిపి ఉంచడం వల్ల ప్రధాన రహదారులపై ట్రాఫిక్‌ స్తంభిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఉద్యోగుల పికప్‌, డ్రాప్‌ కోసం ప్రతి ఐటీ పార్కు తన ప్రాంగణంలోనే తాత్కాలిక హోల్డింగ్‌ బేలు ఏర్పాటు చేయాలని సూచించారు. వాణిజ్య వాహనాలను రోడ్డుపై నిలవకుండా సంస్థల యాజమాన్యాలే బాధ్యత తీసుకోవాలని స్పష్టం చేశారు. ఒక్కరే ప్రయాణించే కార్ల సంఖ్యను తగ్గించేందుకు అధికారిక కార్‌పూలింగ్‌ విధానాలను అమలు చేయాలని సూచించారు. కార్‌పూలింగ్‌ ఉద్యోగులకు ప్రాధాన్య పార్కింగ్‌, మార్గాల ఆధారంగా ప్రయాణికులను అనుసంధానించే సాంకేతిక వ్యవస్థలను అందుబాటులోకి తీసుకురావాలని కోరారు.


ఒక్కసారిగా రోడ్డెక్కకుండా షిఫ్ట్‌లలో మార్పు

వేర్వేరు సంస్థలు తక్కువ మంది ప్రయాణికులతో ప్రత్యేక వాహనాలు నడపడానికి బదులుగా, సమీప కార్యాలయాలు కలిసి ప్రధాన నివాస ప్రాంతాల నుంచి భారీ బస్సులు నడపాలని పోలీసులు ప్రతిపాదించారు. పీక్‌ అవర్స్‌లో ఒత్తిడిని తగ్గించేందుకు ఉద్యోగుల లాగిన్‌, లాగౌట్‌ సమయాలను దశలవారీగా అమలు చేయాలని సూచించారు. కార్పొరేట్‌ సెక్యూరిటీ సిబ్బందికి శిక్షణ ఇచ్చి ‘గ్రీన్‌ మార్షల్స్‌’గా వినియోగించాలని నిర్ణయించారు. ప్రతిపాదనల అమలును పరిశీలించేందుకు రానున్న వారాల్లో వరుస సమీక్షలు నిర్వహిస్తామని సైబరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు తెలిపారు.

Related News సంబంధిత వార్తలు

Advertisement 728 x 90 Banner Placehoder