Police

లాభాల పేరుతో లూటీకి స్కెచ్‌.. నకిలీ ట్రేడింగ్‌ ముఠాల వలలో పడొద్దు!

లాభాల పేరుతో లూటీకి స్కెచ్‌.. నకిలీ ట్రేడింగ్‌ ముఠాల వలలో పడొద్దు!
  • మైలాన్‌ కంపెనీ ఉద్యోగులకు సైబర్‌ నేరాలపై అవగాహన
  • నకిలీ ట్రేడింగ్‌ యాప్‌లు, వాట్సాప్‌ గ్రూపులతో మోసాలు
  • బాధితులు వెంటనే 1930కు ఫిర్యాదు చేయాలని పోలీసుల సూచన

సామాన్యుడి అస్త్రం / ఐడీఏ బొల్లారం : అధిక లాభాలు, గ్యారంటీ రిటర్నుల పేరుతో ప్రజలను మోసం చేస్తున్న నకిలీ పెట్టుబడి ముఠాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఐడీఏ బొల్లారం పోలీసులు సూచించారు. మైలాన్‌ కంపెనీలో ఇన్‌స్పెక్టర్‌ సుధీర్‌కుమార్‌ ఆధ్వర్యంలో ‘సురక్షా కా తిరంగా’ కార్యక్రమంలో భాగంగా కాంట్రాక్ట్‌ ఉద్యోగులకు సైబర్‌ క్రైమ్‌పై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

లాభాల ఎర.. ఖాతాలు ఖాళీ!

ట్రేడింగ్‌, పెట్టుబడి మోసాలు జరుగుతున్న తీరును పోలీసులు ఉద్యోగులకు వివరించారు. తక్కువ సమయంలో అధిక ఆదాయం, నష్టంలేని పెట్టుబడి, గ్యారంటీ రిటర్నులు అంటూ సామాజిక మాధ్యమాల్లో వచ్చే ప్రకటనలను నమ్మవద్దని హెచ్చరించారు. ముఖ్యంగా వాట్సాప్‌, టెలిగ్రామ్‌ పెట్టుబడి గ్రూపులు, నకిలీ ట్రేడింగ్‌ యాప్‌లు, ఏపీకే లింకులు, బోగస్‌ స్టాక్‌ మార్కెట్‌, ఐపీఓ, క్రిప్టో పెట్టుబడి వేదికలతో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. మొదట స్వల్ప మొత్తంతో లాభం వచ్చినట్లు చూపించి నమ్మకం కలిగించిన అనంతరం, పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టించి మోసం చేసే ప్రమాదం ఉందని తెలిపారు. అపరిచితులు పంపే లింకులను తెరవడం, తెలియని యాప్‌లను మొబైల్‌లో ఇన్‌స్టాల్‌ చేయడం ద్వారా వ్యక్తిగత, బ్యాంకింగ్‌ సమాచారం సైబర్‌ నేరగాళ్ల చేతికి వెళ్లే అవకాశముందని హెచ్చరించారు.


పెట్టుబడికి ముందు ‘సెబీ’ తనిఖీ

డబ్బులు పెట్టే ముందు సంబంధిత బ్రోకర్‌ లేదా పెట్టుబడి సలహాదారుడి సెబీ రిజిస్ట్రేషన్‌ను తప్పనిసరిగా ధ్రువీకరించుకోవాలని పోలీసులు స్పష్టం చేశారు. తెలియని వ్యక్తుల బ్యాంకు ఖాతాలు, యూపీఐ ఐడీలకు నగదు బదిలీ చేయవద్దని సూచించారు. ఓటీపీ, యూపీఐ పిన్‌, సీవీవీ, పాస్‌వర్డ్‌ వంటి రహస్య వివరాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతరులతో పంచుకోవద్దన్నారు. సైబర్‌ మోసానికి గురైతే కాలయాపన చేయకుండా వెంటనే 1930 సైబర్‌ క్రైమ్‌ హెల్ప్‌లైన్‌కు కాల్‌ చేయాలని, నేషనల్‌ సైబర్‌ క్రైమ్‌ రిపోర్టింగ్‌ పోర్టల్‌లో ఫిర్యాదు నమోదు చేయాలని అవగాహన కల్పించారు. కార్యక్రమంలో మైలాన్‌ కంపెనీ యాజమాన్య ప్రతినిధులు, ఎస్‌ఐ కిష్టారెడ్డి, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Related News సంబంధిత వార్తలు

Advertisement 728 x 90 Banner Placehoder