- వ్యక్తిగత, కారు, గృహ రుణాల బకాయిల కోసం ఫోన్ లేదా ల్యాప్‌టాప్‌ను లాక్ చేయడం నిషేధం
- రుణంతో కొనుగోలు చేసిన పరికరంపై మాత్రమే పరిమిత ఆంక్షలకు అవకాశం
- ఇన్‌కమింగ్ కాల్స్, SMS, అత్యవసర SOS సేవలను నిలిపివేయడానికి వీల్లేదు
సామాన్యుడి అస్త్రం / హైదరాబాద్: రుణం చెల్లించలేదనే కారణంతో రుణగ్రహీతల మొబైల్ ఫోన్లు, ట్యాబ్లెట్లు, ల్యాప్‌టాప్‌లను రిమోట్‌గా లాక్ చేస్తామంటూ బెదిరించే బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు భారతీయ రిజర్వ్ బ్యాంక్ గట్టి బ్రేక్ వేసింది. వ్యక్తిగత, కారు లేదా గృహ రుణ బకాయిల వసూలు కోసం వినియోగదారుడి పరికరాలను డిసేబుల్ చేయడానికి వీల్లేదని తేల్చిచెప్పింది.
ఏ రుణానికైనా ఫోన్ లాక్ కుదరదు
బకాయి పడిన రుణంతో సంబంధంలేని మొబైల్ లేదా ల్యాప్‌టాప్‌పై బ్యాంకు ఎలాంటి సాంకేతిక ఆంక్షలు విధించకూడదు. ఉదాహరణకు గృహ రుణం, కారు రుణం లేదా వ్యక్తిగత రుణం చెల్లించలేదని రుణగ్రహీత ఫోన్‌ను లాక్ చేయడం నిబంధనలకు విరుద్ధం.
ఆ పరికరానికి రుణమిస్తేనే..
మొబైల్, ట్యాబ్లెట్ లేదా ల్యాప్‌టాప్ కొనుగోలుకు బ్యాంకు ప్రత్యేకంగా రుణం అందించిన సందర్భంలో మాత్రమే అదే పరికరంపై పరిమిత ఆంక్షలు విధించవచ్చు. ఈ అంశాన్ని రుణ ఒప్పందంలో స్పష్టంగా పొందుపరచాలి. బకాయి పడిన వెంటనే పూర్తిగా లాక్ చేయకుండా దశలవారీ విధానాన్ని అనుసరించాలని RBI నిర్దేశించింది.
అత్యవసర సేవలకు తాళం వేయొద్దు
ఆంక్షలు అమలులో ఉన్నప్పటికీ ఇన్‌కమింగ్ కాల్స్, SMS, అత్యవసర SOS ఫీచర్లను నిలిపివేయకూడదు. రుణగ్రహీత భద్రత, జీవనోపాధికి అవసరమైన సేవలకు ఆటంకం కలిగించరాదని స్పష్టం చేసింది.
సాఫ్ట్‌వేర్‌కూ సర్టిఫికెట్ తప్పనిసరి
డివైజ్ లాకింగ్ టెక్నాలజీకి పరికర తయారీ సంస్థ–OEM లేదా సంబంధిత ఆపరేటింగ్ సిస్టమ్ ప్లాట్‌ఫామ్ ధ్రువీకరణ తప్పనిసరి. అనధికార, భద్రతలేని సాఫ్ట్‌వేర్‌ను వినియోగించకూడదు.
వేధింపులకు చెక్
రికవరీ ఏజెంట్లు బెదిరింపులు, అవమానకర వ్యాఖ్యలు, సోషల్ మీడియా వేధింపులకు పాల్పడకుండా బ్యాంకులే బాధ్యత వహించాలి. రుణగ్రహీత లేదా గ్యారెంటర్ వ్యక్తిగత సమాచారాన్ని వసూళ్లకు అవసరమైన పరిమితిలోనే ఉపయోగించాలి. ఈ నిబంధనలు 2027 జనవరి 1 నుంచి అమల్లోకి రానున్నాయి.